ఒక భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం.. ఆ తర్వాత దానికి సొంతంగా సీక్వెల్ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘దబంగ్’ చిత్రాన్ని ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశాడు. హిందీలో ఈ చిత్రానికి ఇంకో రెండు సీక్వెల్స్ వచ్చాయి. కానీ రెండో సినిమా జోలికి పవన్ వెళ్లలేదు. గబ్బర్ సింగ్ పాత్రను మాత్రమే తీసుకుని.. సొంతంగా తనే కొత్త కథ తయారు చేశాడు. స్క్రీన్ ప్లే కూడా సమకూర్చాడు. బాబీ దర్శకత్వంలో చేసిన ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు.
ఐతే ఇప్పుడు పవన్ బాటలో యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ నడవబోతున్నట్లు సమాచారం. అతడి కెరీర్లో నిఖార్సయిన హిట్ అంటే ‘రాక్షసుడు’ మాత్రమే. అల్లుడు శీను, జయజానకి నాయక బాగానే ఆడినా కాస్ట్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. ‘రాక్షసుడు’ లాభాలు అందించి హిట్‌గా నిలిచింది.
తమిళంలో ‘రాక్షసన్’ పేరుతో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని ఒక్క ఫ్రేమ్ కూడా మార్చకుండా జిరాక్స్ కాపీ తీసి పెట్టాడు దర్శకుడు రమేష్ వర్మ. ఐతే కథాకథనాల్లో బలం ఉండటంతో సినిమా బాగానే ఆడింది. తమిళంలో ‘రాక్షసన్’ సీక్వెల్ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ తెలుగులో మాత్రం సొంతంగా దానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. రమేష్ వర్మ కథ సిద్ధం చేస్తున్నాడట.
నిన్న ‘రాక్షసుడు’ వార్షికోత్సవం జరిగిన నేపథ్యంలో ఈ సమాచారం బయటికి వచ్చింది. రమేష్ వర్మకు సన్నిహితుడు, ‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాడట. ఐతే ఓ కొరియన్ సినిమాను కాపీ కొట్టి తీసిన ‘రైడ్’, ‘రాక్షసన్’ రీమేక్ తప్ప రమేష్ వర్మ కెరీర్లో విజయాల్లేవు. సొంత కథలతో తీసిన ఏ సినిమా కూడా ఆడలేదు. మరి ‘ఒరిజినల్’ సత్తా చూపించని దర్శకుడు ‘రాక్షసన్’ లాంటి క్లాసిక్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌ను ఏమాత్రం తీర్చిదిద్దుతాడో చూడాలి.