యుఎస్‌లో విరూపాక్ష బిగ్ షాక్‌

ఈ రోజుల్లో ఒక సినిమాకు టాక్ తేడా వ‌స్తే దాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం చాలా క‌ష్టం. అదే స‌మ‌యంలో టాక్ బాగుంటే.. అది వేగంగా స్ప్రెడ్ అయి సినిమా రేంజ్ మారిపోతుంది. బ‌జ్ త‌క్కువ‌గా ఉన్న‌ సినిమాల‌కు కూడా పాజిటివ్ టాక్ క‌లిసి వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ్యాజిక్ జ‌రుగుతుంటుంది. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ విరూపాక్ష సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. కొన్ని వారాలుగా బాక్సాఫీస్ డ‌ల్లుగా ఉండ‌టం, ఐపీఎల్ ప్ర‌భావం, అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్ ట్రాక్ రికార్డు బాలేక‌పోవ‌డం వ‌ల్ల ఈ సినిమాకు రిలీజ్ ముంగిట ఆశించిన బ‌జ్ లేదు.

తొలి రోజు ఉద‌యం చాలా డ‌ల్లుగా మొద‌లైందీ సినిమా. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా ఆక్యుపెన్సీల్లేవు. కానీ సినిమాకు మంచి టాక్ రావ‌డం.. సాయంత్రానికి వ‌ర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ కావ‌డం బాగా క‌లిసొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఈ సినిమా రిలీజైన ప్ర‌తి చోటా వ‌సూళ్లు పుంజుకున్నాయి.

తొలి రోజు కంటే కూడా ఈ సినిమాకు రెండో రోజు ఎక్కువ వ‌సూళ్లు రావ‌డం విశేషం. యుఎస్‌లో ఈ సినిమా అంచ‌నాల్ని మించి ఆడేస్తోంది. బ‌జ్ త‌క్కువ ఉండ‌టం వ‌ల్ల విరూపాక్షను యుఎస్‌లో చిన్న స్థాయిలోనే రిలీజ్ చేశారు. గురువారం ప్రిమియ‌ర్స్ సంద‌ర్భంగా పెద్ద‌గా సంద‌డే లేదు. కానీ టాక్ బాగుండ‌టంతో శుక్ర‌వారం సినిమా బ‌లంగా పుంజుకుంది. శ‌నివారానిక‌ల్లా ఈ సినిమా యుఎస్‌లో హాఫ్ మిలియ‌న్ మార్కును దాటేయ‌డం విశేషం. ఆదివారం షోల‌న్నీ అయ్యేస‌రికి 6 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్కును కూడా అల‌వోక‌గా దాటేయ‌నుంది.

ఈ ఊపు చూస్తుంటే ఈ సినిమా ఫుల్ ర‌న్లో మిలియ‌న్ మార్కును అందుకోవ‌డం కూడా సాధ్య‌మే కావ‌చ్చు. ఈ సినిమా రేంజికి, రిలీజ్ ముంగిట ఉన్న బ‌జ్‌ను బ‌ట్టి చూస్తే ఇప్పుడు వ‌స్తున్న వ‌సూళ్లు అనూహ్య‌మే. ఈ ట్రెండ్ చూసి అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయ‌ట‌. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి స్క్రీన్టు, లొకేష‌న్లు కూడా పెంచుతున్నార‌ట‌.