మూడేళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం కోసం అఖిల్ ప్రమోషన్లను సైతం రిస్క్ తోనే చేస్తున్నాడు. నిన్న విజయవాడలో 172 అడుగుల ఎత్తు నుంచి తాళ్లు కట్టుకుని కిందకు దూకుతూ చేసిన పోస్టర్ లాంచ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఎంత జాగ్రత్తలు తీసుకుని చేసిందే అయినా ఇలాంటివి ప్రాణాలను రిస్క్ లో పెడతాయి. మామాలుగా అంత పైనుంచి యథాలాపంగా చూసినా కళ్ళు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా జంప్ చేయడమంటే చిన్న విషయం కాదు. కాకినాడలో జరగబోయే ట్రైలర్ లాంచ్ అప్డేట్ తో పాటు సిక్స్ ప్యాక్ ఉన్న కొత్త పోస్టర్ ని విడుదల చేయడం అభిమానులు కిక్ ఇచ్చింది.
ఇది టాలీవుడ్ లోనే మొదటిసారన్నట్టు పబ్లిసిటీ చేశారు కానీ నిజానికి ఇదే తరహా స్టంట్ మంచు విష్ణు 12 ఏళ్ళ క్రితమే చేశాడు. వస్తాడు నా రోజు పోస్టర్ లాంచ్ అచ్చం ఇదే తరహాలో హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ పై అంతస్తు ముందు గోడ నుంచి కిందకు దిగుతూ పెద్ద పోస్టర్ ని రిలీజ్ చేయడం యుట్యూబ్ లో ఉంది. అడుగుల లెక్క వివరాలు ఖచ్చితంగా తెలియవు కానీ వీడియో చూస్తే ఇంచుమించు విష్ణు దూకిన డిస్టెన్స్ అఖిల్ కి కాస్త అటుఇటు సమానంగానే అనిపిస్తోంది. కుర్ర హీరోలు ఉడుకు రక్తంతో ఆకట్టుకునే ఇలాంటి ప్రయత్నాలు మంచిదే కానీ చూస్తున్నవాళ్ళ టెన్షన్ మాములుగా ఉండదు.
ఇంకో పదకొండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఏజెంట్ పబ్లిసిటీలో వేగం పెంచారు. బిజినెస్ వ్యవహారాలు కొలిక్కి వస్తున్నాయి. ఏరియాల వారిగా డీల్స్ పూర్తయ్యాయని నిర్మాత అనిల్ సుంకర టీమ్ నుంచి వినిపిస్తన్న మాట. ఒకటి రెండు ప్రాంతాలకు సంబంధించి ఇంకా ఫైనల్ రాకపోయినా అవసరమైతే అక్కడ ఓన్ రిలీజ్ కి రెడీ అయ్యారట. పొన్నియన్ సెల్వన్ 2ని ఢీ కొట్టబోతున్న ఏజెంట్ కు దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏజెంట్ కే మొదటి తాంబూలం దక్కుతుంది కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అఖిల్ ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న తొలి బ్లాక్ బస్టర్ దక్కినట్టే.