పవన్ OG ఆరంభమే అరాచకం

మాములుగా సినిమా పూర్తయ్యకో లేదా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడో టీజర్ వదలడం చూశాం కానీ పవన్ కళ్యాణ్ సెట్స్ కి రాబోతున్నాడని చెప్పడానికి స్క్రిప్ట్ పూర్తయ్యిందని మెసేజ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా వీడియో కట్ చేయడం మాత్రం పవన్ కళ్యాణ్ ఓజితో మొదలుపెట్టారు. నిర్మాత డివివి దానయ్య దర్శకుడు సుజిత్ తో చేయబోతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఈ వారంలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిమిషంన్నర ప్రత్యేక క్లిప్ ని ఫ్యాన్స్ కోసం విడుదల చేశారు. ఉదయం నుంచి దీని గురించి మాములుగా ఊరించలేదు.

వీడియోలో కొన్ని కీలకమైన క్లూస్ ఇచ్చాడు సుజిత్. మొదటి సీన్ పోర్ట్ లో ప్రారంభం కావడం, పెద్ద ఇనుప గేటు ముందు ఆయుధాలతో దంగి, ఫైజల్ లు నిలబడి ఉండటం, అక్కడ రక్షణగా వందకు పైగా సెక్యూరిటీ గార్డులను ఛేదించుకుని వెళ్లాలనే ఆలోచన రావడం, తూటాలు వర్షంలా దూసుకురావడం, అలా ఈ యుద్ధం జరుగుతూ ఉండగానే చీకటిలో నుంచి ఒక నీడలాంటి శక్తివంతమైన ఆకారం బయటికి రావడం, అతనెవరో కాదు ఓజి అనేలా కట్ చేయడం మొత్తం ఆసక్తికరంగా ఉంది. ఎలాంటి విజువల్స్ చూపకపోయినా కేవలం టెక్స్ట్ లోనే ఈ మ్యాటర్ ఇచ్చేశారు.

తుపాకులు, బులెట్లు, ఛేజులు, ఫైట్లు, ఎత్తుకు పైఎత్తులు, కుట్రలు కుతంత్రాలు ఇలా సుజిత్ మాములు బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోలేదు. గతంలో ఈ తరహా కథతో పవన్ పంజా చేసినప్పటికీ ఈసారి పూర్తిగా కొత్త అనుభూతినిస్తానని దర్శకుడు హామీ ఇస్తున్నాడు. తమన్ నేపధ్య సంగీతం కథకు తగ్గ మూడ్ లో స్టైలిష్ గా సాగింది. ఈ ఏడాదిలోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్న డివివి టీమ్ ఇంకా విడుదల తేదీ డిసైడ్ చేసుకోలేదు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఓజి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టినట్టే.