ఏకంగా కేంద్ర హోం మంత్రికే కరోనా కాటు తప్పలేదు. దీన్ని బట్టే కరోనా ముందు ఎంత పెద్ద వాళ్లయినా తల వంచాల్సిందే అని మరోసారి రుజువైంది. అమిత్ షా కరోనా బారిన పడ్డట్లు వెల్లడవడంతో ఇంకో మూడు రోజుల్లో జరగబోతున్న అయోధ్య రామమందిర శంకు స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం లేకపోయింది.
ఐతే అమిత్ షా గురించి ఈ ప్రతికూల వార్త బయటికి వచ్చిన కాసేపటికే.. మరో సంతోషకరమైన అప్ డేట్ బయటికి వచ్చింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఐతే 76 ఏళ్ల వయసున్న అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోగా.. ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఇంకా కరోనా విముక్తుడు కాలేదు. అతడికి మళ్లీ పాజిటివ్ వచ్చింది. అతడి ఆరోగ్య స్థితి బాగానే ఉందని.. ఇంకొన్ని రోజుల్లో అభిషేక్‌కు నెగెటివ్ రావచ్చని భావిస్తున్నారు.
అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్, కూతురు ఆద్య సైతం కరోనా బారిన పడటం.. వాళ్లు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం పడకపోవడం… ఇంట్లోనే ఉండి కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం తెలిసిన సంగతే. మరోవైపు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కరోనా బారిన పడ్డట్లు తాజాగా వెల్లడైంది. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పేదేముంది?