నార్త్ ఆడియన్స్ చూస్తారా దాసూ

విశ్వక్ సేన్ బోలెడు నమ్మకం పెట్టుకుని చాలా కష్టపడి దర్శకత్వం వహించి నటించిన దాస్ కా ధమ్కీ నెల తిరక్కుండానే ఓటిటిలో వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 అంటే రేపటి నుంచే ఆహాలో హ్యాపీగా చూసేయొచ్చు. బ్రేక్ ఈవెన్ అయ్యింది లాభాలొచ్చాయని చెప్పుకున్నారు కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు అసలు నిజం రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడీ సినిమాని హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేయిస్తున్నాడీ కుర్ర హీరో. అదేంటి ఒక భాషలో డిజిటల్ లో వచ్చే రోజే నార్త్ సైడ్ హాళ్లలో వదలడం ఏమిటనే సందేహం వచ్చినా సమాధానం దొరకడం కష్టమే.

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకునేందుకు విశ్వక్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఓటిటి ప్రపంచంలో ఫలానా బాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ తో ఉచితంగా ఇంట్లోనే చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడిలా చేయడం ఖచ్చితంగా రిస్కే. పోనీ రికార్డులు తిరగేసిన బ్లాక్ బస్టర్ అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ అలా జరగలేదుగా. ప్రస్తుతం హిందీ వెర్షన్ తాలూకు ట్రైలర్ రిలీజ్, ప్రమోషన్లు అన్నీ జరుగుతున్నాయి కానీ ఉత్తరాది జనాలు అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఏది ఏమైనా చిన్నా పెద్దా సంబంధం లేకుండా ఒకవేళ ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒకే డేట్ కి వచ్చేలా నిర్మాతలు జాగ్రత్త పడటం మంచిది. లేదంటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా కిట్టుబాటు కావు. దీనికి సరైన ప్రణాళిక అవసరం. ఆ మధ్య కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ వేదని ఇలాగే ఒకే రోజు ఓటిటి, థియేటర్ లో వదిలి చేటు చేసుకున్నారు. నష్టాలు తప్పలేదు. ఇప్పుడు చూస్తేనేమో దాస్ కా ధమ్కీకీ అదే రిపీట్ చేస్తున్నారు. సరే ఇక్కడి ఫలితం ఎలా ఉన్నా ఏదైనా అద్భుతం జరిగి హిందీలో ఆడుతుందేమోనని ఆశపడుతున్నారు ఫ్యాన్స్