రెహమాన్ అంటే ఖచ్చితంగా రిస్కే

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించడం దాదాపు ఫిక్స్ అయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పుడప్పుడే ప్రకటించకుండా కొంచెం టైం తీసుకుని అనౌన్స్ చేస్తారట. ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తోంది. రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆస్కార్ తెచ్చిన ప్రతిభ ఆయనది. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఇచ్చిన రోజా బొంబాయి లాంటి ఆల్బమ్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తాయి.

కానీ ఆయనకు టాలీవుడ్ ట్రాక్ రికార్డు చాలా బ్యాడ్ గా ఉండటమే ఈ ఆందోళనకు కారణం. కెరీర్ మొదట్లో వెంకటేష్ సూపర్ పోలీస్ కు పని చేశారు. అదెంత డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు తప్ప పాటలు కూడా ఫ్లాపే. రాజశేఖర్ తో గ్యాంగ్ మాస్టర్ చేశారు. ఇది మరీ అన్యాయంగా పోయింది. కృష్ణంరాజు పల్నాటి పౌరుషం కొంత ఆడింది కానీ దానికి రెహమాన్ ప్రత్యేకంగా కంపోజ్ చేసిన ట్యూన్లేమీ లేవు. రీమేక్ కావడంతో ఒరిజినల్ వే వాడుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన కొమరం పులి సాంగ్స్ గురించి చెప్పుకోకపోవడం ఉత్తమం. చైతుకి ఇచ్చిన ఏ మాయ చేశావే సూపర్ ఆల్బమే కానీ అదీ ముందు తమిళంలో కంపోజ్ చేసినదే.

ఇప్పుడు చరణ్ కు కనక నిజంగా కాంబో సెట్ అయితే ఎలాంటి ట్యూన్స్ ఇస్తారోననే ఆందోళన రేగడం సహజం. పొన్నియన్ సెల్వన్ కు సైతం తమిళ జనాలకు కనెక్ట్ అయినట్టుగా అందులో పాటలు మనకు ఎక్కలేదు. గత పదేళ్లలో ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అని చెప్పుకునేది ఏదీ లేదు. అలాంటప్పుడు విపరీతమైన మొహమాటం ఉన్న బుచ్చిబాబు చనువుగా రెహమాన్ నుంచి వర్క్ రాబట్టుకోగలరా అంటే అనుమానమే. ఇళయరాజా లాగే రెహమాన్ మేజిక్ గత దశాబ్దకాలంలో బాగా తగ్గిపోయింది. ఈ వార్త ఒకవేళ నిజమైతే ఒకప్పటి రెహమాన్ బయటికి వస్తేనే హమ్మయ్య అనుకోవచ్చు.