దేశముదురు షోలు ఫట్టా హిట్టా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన దేశముదురు కలెక్షన్ల మీద సోషల్ మీడియా ఫ్యాన్స్ పరస్పరం పెద్ద డిబేట్లు చేసుకుంటున్నారు. ఆరెంజ్, జల్సా, ఖుషి, పోకిరి రేంజ్ లో ఇది కూడా రికార్డులు సృష్టించాలని బన్నీ అభిమానులు గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే నిన్న హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ ఉదయం షో నుంచే కిక్కిసిరిపోయింది. షో నడుస్తున్న టైంలో అల్లరి మితిమీరడంతో స్క్రీన్ కు చిరుగు పడింది. సాయంత్రం బాణాసంచాను అదుపు చేయడానికి ఏకంగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

వైజాగ్ శరత్, కర్నూలు శ్రీరామ లాంటి చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అయితే ఇదంతా ఒక వైపు. సుమారు నూటా ఎనభైకి పైగా స్క్రీన్లలో దేశముదురుని విడుదల చేస్తే చాలా మటుకు బిసి సెంటర్స్ లో కనీస వసూళ్లు రాలేదని టాక్. అమలాపురంలో ఉదయం ఆటకు కేవలం సింగల్ డిజిట్ టికెట్లు తెగాయన్న వార్త ట్విట్టర్, ఇన్స్ టాలో వైరల్ అయ్యింది. కొన్నిచోట్ల నిజంగానే ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేవు. అంత పెద్ద డిజాస్టర్ ఆరెంజ్ కి ఆ రేంజ్ లో యూత్ ఎగబడినప్పుడు బ్లాక్ బస్టర్ దేశముదురుకి అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేయడం సహజం.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. రీరిలీజులకు జనం రావడం రాకపోవడమనేది వాటి ఒరిజినల్ బాక్సాఫీస్ ఫలితం మీదే ఆధారపడదు. ఉదాహరణకు వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి క్లాసిక్స్ కనీస స్థాయిలో ఆడలేకపోయాయి. అయిదారు కేంద్రాల్లో మాత్రం జనం నిండుగా వచ్చారు. దేశముదురు విషయంలో మరీ అంత దారుణంగా కాకపోయినా అంచనాల మేరకు రికార్డులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సరసన బన్నీ కూడా నిలవాలనే ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. ఆర్యతో ఛాన్స్ ఉందేమో.