డాన్స్ మాస్టర్ గా ఒకప్పుడు చిరంజీవి రేంజ్ అగ్రహీరోలకు చిరకాలం గుర్తుండిపోయే స్టెప్పులను కంపోజ్ చేసిన లారెన్స్ రాఘవేంద్ర ఆ తర్వాత దర్శకుడిగా నాగార్జునతో మాస్ లాంటి సూపర్ హిట్లు స్టైల్, డాన్ టైపు విజయవంతమైన చిత్రాలు ఇచ్చాడు. ముని సక్సెస్ అయ్యాక పూర్తిగా దెయ్యాల సినిమాలకే ఫిక్సయిపోయిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరో ఏప్రిల్ 14న రుద్రుడుతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నిన్న చెన్నైలో చాలా గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వారంలోనే ఇదే వేడుక తెలుగులోనూ జరపబోతున్నారు.
సరే లారెన్స్ ని చూసి చాలా కాలమయ్యింది కదా ఏదో కొత్తగా ట్రై చేసుంటాడని ఫ్యాన్స్ ఎదురు చూశారు. తీరా చూస్తే ఇదీ రొటీన్ కమర్షియల్ మాస్ బొమ్మేనని అర్థమైపోయింది. హీరో ఓ మంచి సందర్భంలో అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఓ రెండు పాటలు పాడుకున్నాక ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పాప పుడుతుంది. వీళ్ళ జీవితంలోకి విలన్ ఎంటరయ్యాక భార్య చనిపోతుంది. బడా బిజినెస్ కం మాఫియా డాన్ అయిన శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం లారెన్స్ రుద్రావతారం ఎత్తి జాతర దగ్గర అతనితో తలపడి అంతు చూస్తాడు. కథ మొత్తం ఓపెన్ చేశారు.
రుద్రుడు దర్శకుడు కదిరేశన్. గతంలో ఎన్నోసార్లు చూసిన పీల్చి పిప్పి చేసిన లైన్ నే మళ్ళీ తీసుకున్నాడు. ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు, హీరో విలన్ పరస్పరం విసురుకునే సవాళ్లు, మాస్ అంశాలు ఏ మాత్రం కొత్తదనం అనిపించకుండా ప్రతి ఫ్రేమ్ ని చాలా జాగ్రత్తగా చెడగొట్టినట్టు అనిపిస్తుంది. లారెన్స్ వీర ఫ్యాన్స్ కి అరవంలో ఈ మసాలా నచ్చవచ్చేమో కానీ తెలుగు ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే అనిపిస్తుంది. ఈసారి దెయ్యాల భూతాల జోలికి పోయినట్టు కనిపించడం లేదు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ కాగా శరత్ కుమార్ విలన్ గా నటించారు. శాకుంతలంతో పాటు రుద్రుడు ఒకేరోజు రానున్నాయి.