ఆహాలో అనూహ్య మార్పులు

ఓన్లీ తెలుగు ఓన్లీ లోకల్ నినాదంతో మొదలైన ఆహా ఓటిటి జనాన్ని బాగానే ఆకట్టుకుంటోంది కానీ ప్రైమ్, హాట్ స్టార్ స్థాయిలో రీచ్ పెంచుకునేందుకు వేస్తున్న స్ట్రాటజీలు పూర్తి ఫలితాన్ని ఇవ్వడం లేదు. వందల కోట్ల పెట్టుబడులతో అల్లు అరవింద్ తో పాటు మై హోమ్ సంస్థ ఇందులో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అల్లు స్టూడియోస్ పూర్తయ్యే లోపు ఆహాని ఒక గ్లోబల్ బ్రాండ్ చేయాలన్నది ఆ టీమ్ పెట్టుకున్న టార్గెట్. దానికి తగ్గట్టే నాయకత్వంలో పలు మార్పులతో పాటు రాబోయే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిఈఓగా ఉన్న అజిత్ ఠాకూర్ ని బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ కి ప్రమోట్ చేసి స్టూడియోకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈయన స్థానంలో కొత్త సిఈఓగా రవికాంత్ సబ్నవీస్ ఛార్జ్ తీసుకుంటారు.

ఈయనకు గతంలో స్టార్ నెట్ వర్క్, కింగ్ ఫిషర్ తదితర మల్టీ నేషనల్ కంపెనీలతో పని చేసిన అనుభవం ఉంది. రాబోయే మూడేళ్ళ కాలానికి గాను సుమారు వెయ్యి కోట్లకు సరిపడా ఇన్వెస్ట్ మెంట్ ని ఆహా సిద్ధం చేసుకోబోతున్నట్టు సమాచారం. గ్లోబల్ మార్కెట్ లో పోటీ పడాలంటే రాజీ పడకూడదనే నిర్ణయంతో ఇంత మొత్తం పెట్టుబడి కాబోతోంది.

నిజానికి ఆహా భీభత్సమైన లాభాల్లో లేదు. ఇంకా ఎదిగే స్టేజిలోనే ఉంది. తక్కువ ధరను చందాగా పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే భారీగా పెరిగారు కానీ రెవిన్యూ ఇంకా దానికి తగ్గట్టు ఉత్పత్తి కావడం లేదు. అయితే భవిష్యత్తు శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ని డామినేట్ చేయబోయే స్థాయిలో ఓటిటి ఎదుగుతోంది కాబట్టి పోటీ మరీ తీవ్రంగా ముదరకముందే బ్రాండ్ ఎస్టాబ్లిష్ మెంట్ జరిగిపోవాలి. అందుకే అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టింది. అన్ స్టాపబుల్, ఇండియన్ ఐడల్ లాంటి షోలతో పాటు హైబడ్జెట్ వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ ప్లానింగ్ లో ఉన్నాయి.