అందరూ ఫ్రీ ప్రీమియర్ షోలు చూసి ఆహా ఓహో అన్నారు. ప్రసాద్ ల్యాబ్స్ బయటికి వచ్చి కృష్ణవంశీకి కౌగలించుకుని ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మరీ ఏకంగా కాళ్ళు పట్టేసుకున్నంత పని చేశారు. ఇదంతా రంగమార్తాండకు మొదటి రెండు రోజులు నాలుగైదు ఆటలకు బాగానే పని చేసింది. జనాలు థియేటర్లకు వచ్చారు. హౌస్ ఫుల్స్ కాలేదు కానీ బలగం లాగా స్లోగా ఎక్కుతుందేమోనని బయ్యర్లు ఎదురు చూశారు. కానీ అదేమీ జరగలేదు. రోజు రోజుకి డ్రాప్ మరీ అన్యాయంగా పెరిగిపోయి డెఫిషిట్ల దాకా వెళ్లిపోయింది.
కట్ చేస్తే రంగమార్తాండ పట్టుమని రెండు కోట్ల షేర్ వసూలు చేయడం కూడా దుర్లభం అనేలా ఉంది. ఇక్కడ టీమ్ స్వయంకృతాపరాధం లేకపోలేదు. ప్రమోషన్లను లైట్ తీసుకున్నారు. బలగంలాగా టూర్లు వేసి విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉంటే అంతో ఇంతో జనంలో ఆసక్తి పెరిగి మౌత్ టాక్ పాకిపోయేది. టైటిల్ రోల్ పోషించిన ప్రకాష్ రాజే ఒక్క ప్రెస్ మీట్, ఒక్క రోజు ఇంటర్వ్యూలకు పరిమితమైనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు. అక్కడికి బ్రహ్మానందం తన వంతుగా బయటికొచ్చి ఇతోధికంగా అందుబాటులో ఉంటూ పబ్లిసిటీలో భాగమయ్యారు
ఫైనల్ గా రంగమార్తాండకు ఆపరేషన్ సక్సెసయ్యింది కానీ రోగి లేవలేదు చావలేదు అన్నట్టు మిగిలింది. ఓటిటిలో వచ్చాక కోట్లలో వ్యూస్ రావొచ్చు. కానీ కృష్ణవంశీ కోరుకుంది అది కాదు. థియేటర్లలో ఆడాలి. నాలుగు డబ్బులు రావాలి.అది జరగనప్పుడు స్మార్ట్ స్క్రీన్లలో, టీవీల్లో ఎందరు చూస్తే ఏం లాభం. ఇళయరాజా సంగీతం, మంచి క్యాస్టింగ్, మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఇన్ని సానుకూలతలు ఉన్నా రంగమార్తాండ గట్టెక్కలేకపోయింది. నష్టాల లెక్క తేలాల్సి ఉంది. రేపు నాని దసరా గ్రాండ్ రిలీజ్ ఉండటంతో చాలా చోట్ల కెవిగారి సినిమాని రీప్లేస్ చేయబోతున్నారు.