పవన్.. అసలైన పాన్ ఇండియా సినిమా

టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోలు కూడా తమ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అదేమీ మొక్కుబడిగా కూడా కాదు. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేసి.. వీలైనంత మేర వేర్వేరు భాషల్లో సన్నివేశాలు చిత్రీకరించి.. పాన్ ఇండియా స్థాయిలోనే ప్రమోషన్లు కూడా చేసి రిలీజ్ చేస్తున్నారు.

గురువారం రిలీజ్ కానున్న ‘దసరా’ కూడా ఈ కోవకు చెందిందే. ఐతే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ప్రాపర్ పాన్ ఇండియా సినిమా చేయలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఒక్కటి హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కడం, రిలీజ్ కావడం జరిగింది. ‘హరిహర వీరమల్లు’ అనౌన్స్ చేసినపుడు పాన్ ఇండియా సినిమా కాదు, కానీ తర్వాత అలా మార్చారు.

దాన్ని తెలుగులో తీసి వేరే భాషల్లోకి అనువాదం చేస్తున్నట్లే. ఐతే పవన్ ఇప్పుడు అసలు సిసలైన పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఓజీ’ ఆ ఘనతను సొంతం చేసుకోబోతోంది. ఈ సినిమాకు ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనేది వర్కింగ్ టైటిలే అనుకున్నారు కానీ.. తర్వాత అదే పేరు ఖరారైపోయింది. కేవలం తెలుగు వరకే కాదు.. ఐదు భాషల్లో ఇదే టైటిల్ పెట్టబోతున్నారు.

ఈ మేరకు నిర్మాత డీవీవీ దానయ్య ఆయా భాషల్లో టైటిల్‌ కూడా రిజిస్టర్ చేయించేశాడట. ఇటీవలే ‘వినోదియ సిత్తం’ రీమేక్‌కు సంబంధించి తన పని పూర్తి చేసిన పవన్.. త్వరలోనే హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఆ తర్వాత సుజీత్ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. వీలును బట్టి ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ చూస్తున్నాడు.