మొన్న ఫిబ్రవరిలో వినరో భాగ్యము విష్ణుకథ రూపంలో చెప్పుకోదగ్గ విజయం అందుకున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రెండు నెలలు తిరక్కుండానే మీటర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర ఉన్నప్పటికీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో పోటీకి సిద్ధపడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ ఇందులో నిర్మాణ భాగస్వామి కావడంతో ప్రొడక్షన్ పరంగా ప్రమోషన్ పరంగా మార్కెటింగ్ బాగా జరుగుతోంది. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ ఖాకీ డ్రామాలో అతుల్య రవి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇందాకా ట్రైలర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
కుర్ర పోలీసు అర్జున్ కళ్యాణ్(కిరణ్ అబ్బవరం) కు దూకుడెక్కువ. స్టేషన్ కి వచ్చి జాలీగా టైం పాస్ చేయాలనుకునే రకం. ఇదే డిపార్ట్ మెంట్ లో పని చేసి కొందరు దుర్మార్గుల వల్ల అవమానం పాలైన తండ్రికి న్యాయం జరిగే ఉద్దేశంతో ముందు సరదాగా ఉన్న కళ్యాణ్ తర్వాత రాజకీయ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మీటర్ పెంచి గేరు మారుస్తాడు. వీడేం చేస్తాడని లైట్ తీసుకున్న విలన్ బ్యాచ్ కి చుక్కలు చూపించడం మొదలుపెడతాడు. మరోవైపు ఇతనికో లవ్ స్టోరీ(అతుల్య రవి) రన్ అవుతూ ఉంటుంది. ఇంతకీ కళ్యాణ్ దేనికోసం డ్యూటీ చేశాడనేదే అసలు కథ
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కళ్యాణ్ రామ్ పఠాస్ తరహా ట్రీట్ మెంట్ తో దర్శకుడు రమేష్ పూర్తి కమర్షియల్ ఫార్ములాలో ఈ మీటర్ ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. కిరణ్ చేయడమనే విషయం తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారంలాగే ఉంది. ట్రీట్ మెంట్ లో ఏదైనా వైవిధ్యం చూపించారేమో తెలియాలంటే థియేటర్లలో వచ్చే దాకా ఆగాలి. సాయి కార్తీక్ సంగీతం సైతం రెగ్యులర్ మార్క్ లోనే సాగింది. పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసిన కిరణ్ అబ్బవరం ఈసారి ఖాకీ డ్రెస్సు సహాయం తీసుకున్నాడు. ఇమేజ్ ని మించిన పాత్రను ఎంచుకున్న ఈ యూత్ హీరో ఎలా మెప్పించనున్నాడో చూడాలి మరి