శంకర్ వల్లే విడుదల తేదీ అయోమయం

Ram Charan Game Changer

ఒకే దర్శకుడు ఒకే సమయంలో వేర్వేరుగా ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తే ఎలాంటి సమస్య వస్తుందో శంకర్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ గేమ్ ఛేంజర్ టైటిల్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. రెండింటికి స్పందన బాగానే ఉంది. అయితే ఫ్యాన్స్ వీటికన్నా ఎక్కువగా రిలీజ్ డేట్ కోసం ఎదురు చూశారు. ప్రభాస్, మహేష్ బాబులు 2024 సంక్రాంతికి రావడం ఖరారు చేసుకున్న నేపథ్యంలో మెగా పవర్ స్టార్ కూడా వస్తే రసవత్తరమైన ట్రయాంగిల్ పోటీ చూడొచ్చని ఆశ పడ్డారు.

తీరా చూస్తే నిర్మాత దిల్ రాజు అసలు విషయాన్ని మాత్రం దాచేశారు. దానికి కారణం శంకరే. కమల్ హాసన్ తో ఆయన చేస్తున్న ఇండియన్ 2 కీలక దశలో ఉంది. దీపావళికి వదలాలని చూస్తున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉండటంతో అదంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. దానికి తోడు విజయ్ లియో ఆల్రెడీ బరిలో ఉంది కాబట్టి దాంతో తలపడితే థియేటర్ల పంపకంలో ఇబ్బంది వస్తుంది. అందుకే కమల్ సైతం పొంగల్ కే మొగ్గు చూపుతున్నారట. అదే జరిగితే శంకర్ ఒకే టైంలో తన రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ససేమిరా ఒప్పుకోరు.

అందుకే ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. ప్రాధాన్యత పరంగా చూసుకుంటే ముందు మొదలయ్యింది ఇండియన్ 2నే. అయితే క్రేన్ ప్రమాదంతో పాటు పలు ఆర్థిక కారణాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. విక్రమ్ బ్లాక్ బస్టర్ అయ్యాక లైకా తిరిగి ప్రొడక్షన్  మొదలుపెట్టి అగ్రిమెంట్ ప్రకారం శంకర్ ని ఇండియన్ 2 పూర్తి చేసేలా కోర్టు ద్వారా ఒత్తిడి చేసింది. ఇదంతా ముందే ఊహించని రామ్ చరణ్ దిల్ రాజులు ఈరకంగా  ఇరుకున పడ్డారు. సో గేమ్ చేంజర్ డేట్ తేలాలంటే ముందు ఇండియన్ 2 క్లారిటీ రావాల్సిందే. అప్పటిదాకా ఈ అయోమయం కొనసాగక తప్పదు.