విడుదల రోజు కలెక్షన్ 15 లక్షలు

చూస్తుంటే బాలీవుడ్ మళ్ళీ క్రాస్ రోడ్స్ లోకి వచ్చినట్టుంది. పఠాన్ సాధించిన వెయ్యి కోట్ల ఆనందం మెల్లగా ఆవిరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కిందా మీద పడి తూ ఝూటి మై మక్కర్ హిట్ అనిపించుకుని వంద కోట్ల మార్క్ దాటేస్తే మిగిలినవి కనీసం పబ్లిసిటీ ఖర్చలు కూడా తేవడం లేదు. నిన్న భీడ్ రిలీజయ్యింది. విలక్షణమైన కథలను ఎంచుకుంటాడని పేరున్న రాజ్ కుమార్ రావు హీరో. భూమి పెడ్నేకర్ హీరోయిన్. కరోనా సమయంలో మొదటిసారి విధించిన లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ భీడ్ ని రూపొందించారు.

ఈయనేమి ఆషామాషీ డైరెక్టర్ కాదు. ఆర్టికల్ 15 మూవీ రేపిన సంచలనం అందరికీ గుర్తే. ముల్క్, తప్పడ్ లు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అనేక్ మాత్రం ఫ్లాప్ అయ్యింది. సరే ఇవన్నీ ఫలితంతో సంబంధం లేకుండా డీసెంట్ నెంబర్లు నమోదు చేసుకున్నవి. కానీ భీడ్ మాత్రం విడుదల రోజు దేశవ్యాప్తంగా అన్ని సెంటర్లలో కలిపి కేవలం 15 లక్షల నెట్ ని వసూలు చేయడం ట్రేడ్ ని నివ్వెరపరిచింది. చాలా చోట్ల కనీసం ఒకరిద్దరు ఆడియన్స్ కూడా లేక షోలు క్యాన్సిల్ చేశారు. చూసిన పది ఇరవై మంది బానే ఉందని చెప్పడం కొసమెరుపు.

సహజత్వం కోసం భీడ్ ని బ్లాక్ అండ్ వైట్ లో తీయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని చంపేసింది. ఎంత న్యాచురాలిటీ అయినా మరీ ఇంత సాహసానికి ఒడిగడితే కష్టమే. పైగా పెద్ద స్క్రీన్ మీద అంతసేపు రంగులు లేకుండా ఇంత సీరియస్ డ్రామాని జనం భరించలేరు. అందుకే ఫలితం కూడా రివర్స్ అయ్యింది. కబ్జలాంటి ఇతర బాషల నుంచి డబ్బింగ్ చేసినవి సైతం డిజాస్టర్ కావడంతో నార్త్ బయ్యర్ల కళ్లన్నీ అజయ్ దేవగన్ భోళా మీద ఉన్నాయి. నాని ప్రమోషన్ల పుణ్యమాని దసరాకు కూడా మెల్లగా బజ్ పెరుగుతోంది. ఇక సోమవారం నుంచి భీడ్ పని ముగిసినట్టే.