చరణ్ వెర్సస్ ఎన్టీఆర్.. అప్పుడు చూస్కుందాం

‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి.. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు దక్కే వరకు మెగా, నందమూరి అభిమానుల మధ్య ఏ రేంజిలో ఫ్యాన్ వార్స్ జరిగాయో అందరూ చూశారు.

హీరోలేమో మొదట్నుంచి ఆప్తమిత్రుల్లా మెలుగుతూ.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. అభిమానులు మాత్రం ఈ సినిమాలో పాత్రల పరంగా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం దక్కింది.. ఏ పాత్ర బాగా ఎలివేట్ అయింది.. ఎవరు డామినేట్ చేశారు.. ఎవరికి ఎక్కువ పేరొచ్చింది.. లాంటి విషయాల మీద సంవత్సరాల తరబడి కొట్టేసుకున్నారు. ఆస్కార్ అవార్డు దక్కింది సినిమాలోని పాటకు, అవార్డు అందుకున్నదేమో కీరవాణి, చంద్రబోస్‌లు కాగా.. ఇందులో కూడా తారక్, చరణ్‌ల్లో ఎవరికి ఎక్కువ క్రెడిట్ అనే విషయంలో ఎడతెరపి లేని గొడవలు జరిగాయి.

ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఎవరు ఎక్కువ మార్కెట్ సంపాదించారు.. తమ తర్వాతి చిత్రాలతో ఎవరు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్టార్‌గా మారబోతున్నారు అనే విషయాల్లోనూ అభిమానుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటించిన ‘ఆచార్య’ రిలీజైంది. కానీ అందులో అతడిది లీడ్ రోల్ కాదు. ఆ సినిమా ఫెయిల్యూర్‌ను అతడికి ఆపాదించలేం.

చరణ్ అసలు సత్తా ఏంటన్నది శంకర్ సినిమాతో తెలుస్తుంది. అది పాన్ ఇండియా సినిమా. శంకర్ లాంటి మేటి దర్శకుడి అండ కూడా ఉంది. ఇక తారక్ విషయానికి వస్తే ‘ఆచార్య’ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. అంతకుముందు కొరటాల శివకు గొప్ప ట్రాక్ రికార్డుంది. కాబట్టి ఆయన్ని తక్కువ అంచనా వేయలేం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో సినిమా చేయడానికి కొరటాల బాగానే కసరత్తు చేశాడు. చరణ్ సినిమా లాగే ఇది కూడా పాన్ ఇండియా మూవీనే.

చరణ్ మూవీలో నటిస్తున్న కియారా అద్వానీ, తారక్ చిత్రంలో ఉన్న జాన్వి కపూర్ ఇద్దరూ కూడా బాలీవుడ్ భామలే. ఇలా ఏ రకంగా చూసుకున్నా బలాబలాలు దాదాపు సమం అన్నట్లే ఉంది పరిస్థితి. చరణ్ సినిమా చాలా ముందుగానే సెట్స్ మీదికి వెళ్లినా.. రకరకాల కారణాలతో ఆలస్యమై వచ్చే ఏడాది ఆరంభంలో రాబోతోంది. తర్వాత మూడు నెలలకే తారక్ సినిమా వస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎవరెక్కువ అని చూడటం కంటే.. ఈ సినిమా తర్వాత వీళ్లెంత ఎదిగారు, వీరి బాక్సాఫీస్ సత్తా ఏపాటిది అన్నది వచ్చే ఏడాది వారి వ్యక్తిగత చిత్రాలతో చూడాలి. అంతవరకు ఇరు వర్గాల అబిమానులు సంయమనం పాటిస్తే బెటర్.