తెలుగు ‘రేస్’ చేద్దామనుకున్నారా?

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ యూత్‌లో ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యువ నటుడు విశ్వక్సేన్. తొలి రెండు చిత్రాల్లో అతను నటుడిగా మాత్రమే తెలుసు జనాలకు. కానీ మూడో చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’కే అతను డైరెక్టర్ అయిపోయాడు. ఇది రీమేక్ మూవీనే అయినప్పటికీ.. హైదరాబాద్ నేటివిటీకి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని బాగానే తీర్చిదిద్ది తన టాలెంట్ చూపించాడు విశ్వక్. ఈ సినిమా తీసే సమయానికి అతడి వయసు 22 ఏళ్లే కావడం విశేషం.

దీని తర్వాత హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్.. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ విశ్వక్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్, సినిమాకు వచ్చిన హైప్ వల్ల ఓపెనింగ్స్‌కు అయితే ఢోకా లేదు. తొలి రోజు మంచి ఆక్యుపెన్సీతో నడిచిందీ సినిమా.

డివైడ్‌ టాక్‌ను తట్టుకుని ఈ వీకెండ్ అంతా ఇలాగే నిలబడితే సినిమా హిట్ రేంజిని అందుకోబోతున్నట్లే. ఇక సినిమా విషయానికి వస్తే.. రిలీజ్ ముంగిట అందరూ ఇది ‘ధమాకా’లాగే ఉందేంటి అనుకున్నారు. ట్రైలర్ చూస్తే రవితేజ సినిమాతో పోలికలు కనిపించాయి. ‘ధమాకా’కు రచయితగా పని చేసిన ప్రసన్నకుమార్ బెజవాడనే దీనికి రైటర్ కావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి.

కానీ ఒకే కథను రెండు సినిమాలకు ఇస్తే ఇండస్ట్రీలో ప్రసన్న తిరగగలడా.. అదే కథతో సినిమా చేయడానికి నేనేమైనా పిచ్చోడినా అన్నాడు విశ్వక్. సినిమా చూస్తే నిజంగానే ‘ధమాకా’కు దీనికి అసలు పోలిక లేదన్న విషయం చాలా త్వరగానే అర్థమైపోతుంది. ఒక ధనవంతుడి స్థానంలోకి మామూలు కుర్రాడు రావడం అన్న దగ్గరే పోలిక కనిపిస్తుంది. ‘ధమాకా’లో రెండు పాత్రలూ చేసింది ఒక రవితేజనే కాగా.. ఇక్కడ విశ్వక్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు.

ఇక ‘ధమాకా’తో పోలిక ఉండొద్దని చేశారా.. లేదంటే మామూలుగానే జరిగిందా అన్నది తెలియదు కానీ.. ఇంటర్వెల్ నుంచి సినిమాలో కథను ఎలా పడితే అలా ట్విస్ట్ చేసేశారు. మామూలుగా ట్విస్టులంటే చాలా థ్రిల్ ఇస్తాయి. కానీ ఇందులో అవి ఓవర్ డోస్ అయిపోయి విసిగించాయి. లాజిక్ లేకుండా ఎలా పడితే అలా కథను మలుపులు తిప్పేయడం వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. ఈ ట్విస్టుల విషయంలో, పాత్రల తీరుతెన్నుల్లో హిందీ మూవీ ‘రేస్’తో పోలికలు కనిపిస్తాయి. అందులో మాదిరే ఇందులో అన్నీ కన్నీ క్యారెక్టర్లే కనిపిస్తాయి. అంతే కాక మనం చూసిన ప్రతిదీ ఒక అబద్ధం అని.. ప్రతి దాని వెనుక వేరే ప్లాన్ ఉందని చివర్లో తెలుస్తోంది. ఈ ట్విస్టుల్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. కానీ ఎక్కువమంది వీటి విషయంలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.