ఆ వీడియో చూసి చిరు ఫ్యాన్స్ హర్టు


‘ఛలో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ కుడుముల. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర అంతకుముందు శిష్యరికం చేసి దర్శకుడిగా పేరు సంపాదించిన ఎవ్వరూ ఇండస్ట్రీలో లేని నేపథ్యంలో త్రివిక్రమ్ అసిస్టెంట్ అనే ముద్రతో దర్శకుడిగా మారిన వెంకీ మీద కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ తొలి సినిమాను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్ది మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ. ఆ తర్వాత ‘భీష్మ’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా విజయవంతంగా దాటేశాడు. ‘ఛలో’ను మించి ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.

ఐతే అతడి మూడో సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా టైం పట్టేసింది. అలా అని అతనేమీ ఖాళీగా లేడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది అతడికి. ఆయన కోసం కష్టపడి ఒక స్క్రిప్టు తయారు చేశాడు. కానీ అది చివరికి చిరును మెప్పించలేదు. సినిమా క్యాన్సిలైంది.

దీంతో తిరిగి నితిన్‌తోనే సినిమా సెట్ చేసుకున్నాడు. ‘భీష్మ’లో కథానాయికగా నటించిన రష్మికనే ఇందులోనూ హీరోయిన్. ఈ ముగ్గురి కలయికలో కొత్త సినిమా గురించి అనౌన్స్‌మెంటే చాలా వెరైటీగా చేశారు. నితిన్, రష్మిక, సంగీత దర్శకుడు జీవీ కుమార్, వెంకీ కలిసి ఒకరి మీద ఒకరు.. అలాగే తమ మీదే తామే పంచులు వేసుకుంటూ భలే ఎంగేజ్ చేశారు ఈ వీడియోలో. సినిమా అనౌన్స్‌మెంటే చాలా క్రియేటివ్‌గా చేశారని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో చూశాక చిరు ఫ్యాన్స్ ఒకింత బాధ పడుతున్న మాట వాస్తవం. ఓవైపు మెహర్ రమేష్ లాంటి ఔట్ డేటెడ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తూ.. ఇలాంటి ట్రెండీ డైరెక్టర్‌తో చిరు సినిమా క్యాన్సిల్ చేయడమేంటి అనుకుంటున్నారు. చిరు పని చేస్తున్న ఏ దర్శకుడితో పోల్చుకున్నా వెంకీ వాళ్లకు బెటర్‌గానే కనిపిస్తున్నాడు. అతడికి ఇప్పటి యూత్ పల్స్ తెలుసు. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. కమర్షియల్ హంగులకు తన సినిమాల్లో లోటు ఉండదు. అలాంటి డైరెక్టర్‌తో సినిమా చేస్తే ఇప్పటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందించేవాడు. అతను మూడో సినిమాతో కూడా హిట్ కొట్టాడంటే మాత్రం చిరు పెద్ద తప్పు చేశాడని అందరూ ఫిక్సయిపోతారేమో.