మ‌ర్యాద‌రామ‌న్న ఒప్పుకుంటే ఆర్ఆర్ఆర్ పోయేది

బాహుబ‌లి లాంటి మెగా స‌క్సెస్ త‌ర్వాత డీవీవీ దాన‌య్య ప్రొడ‌క్ష‌న్లో రాజ‌మౌళి సినిమా చేయ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఐతే దాన‌య్యకు ఎప్పుడో ఇచ్చిన క‌మిట్మెంట్‌ను నెర‌వేరుస్తూ ఇప్పుడీ భారీ చిత్రాన్ని ఆయ‌న బేన‌ర్లో చేశాడు జ‌క్క‌న్న‌.

ఐతే ఈ సినిమా మెగా స‌క్సెస్ అయి ఆస్కార్ అవార్డుల్లో పోటీ ప‌డే వ‌ర‌కు వెళ్ల‌గా.. రిలీజ్ త‌ర్వాత నిర్మాతను రాజ‌మౌళి అండ్ కో పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విష‌యంలో రాజ‌మౌళిని విమ‌ర్శించిన వాళ్లూ లేక‌పోలేదు. ఐతే ఇప్పుడు స్వ‌యంగా దాన‌య్యే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను రాజ‌మౌళి త‌న బేన‌ర్లో చేయ‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వం అని.. రూ.400 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మించిన తాను.. మంచి ఫ‌లితాన్ని అందుకున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. ఆస్కార్ ప్ర‌మోష‌న్ కోసం తాను రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని.. రాజ‌మౌళి ఎంత ఖ‌ర్చు పెట్టారో తెలియ‌ద‌ని ఆయ‌న‌న్నారు.

త‌న‌తో సినిమా చేసేందుకు గాను తాను రాజ‌మౌళికి అడ్వాన్స్ ఇచ్చి చాలా ఏళ్ల‌యింద‌ని.. మ‌గ‌ధీర త‌ర్వాత రాజ‌మౌళి మ‌ర్యాద‌రామ‌న్న సినిమా చేసే స‌మ‌యంలో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగాడ‌ని.. కానీ పెద్ద సినిమా చేయాల‌న్న ఉద్దేశంతో తాను తిర‌స్క‌రించాని చెప్పాడు దాన‌య్య‌. అప్పుడా సినిమా వ‌ద్ద‌న్నాక‌.. తన‌కున్న వేరే క‌మిట్మెంట్లు పూర్త‌య్యేస‌రికి చాలా టైం ప‌డుతుంద‌ని రాజ‌మౌళి చెప్పాడ‌ని.. అయినా తాను ఓపిగ్గా ఎదురు చూడ‌గా.. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టీజియ‌స్ మూవీని ప్రొడ్యూస్ చేసే అవ‌కాశం ద‌క్కింద‌ని దాన‌య్య తెలిపాడు.

మెగా, నంద‌మూరి ఫ్యామిలీల‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు క‌లిసి చేసిన సినిమా త‌న బేన‌ర్లో తెర‌కెక్క‌డం గ‌ర్వ‌కార‌ణం అని ఆయ‌న‌న్నారు. దాన‌య్య ఒప్పుకుని ఉంటే మర్యాద‌రామ‌న్న లాంటి చిన్న సినిమాతో అయ‌నకు రాజ‌మౌళి ఇచ్చిన క‌మిట్మెంట్ పూర్త‌య్యేది. కానీ ఆయ‌న ఆ రోజు ఓపిక ప‌ట్ట‌బ‌ట్టి ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీని నిర్మించే అవ‌కాశం ద‌క్కింది.