‘జిన్నా’ ఫ్లాపవడం తట్టుకోలేకపోయా-మోహన్ బాబు


టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా, నిర్మాతగా వైభవం చూసిన వ్యక్తి మోహన్ బాబు. తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. 90వ దశకంలో పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు లాంటి సూపర్ హిట్లు కొట్టారు. కానీ ఆ తర్వాత ట్రెండును అందిపుచ్చుకోలేక వరుస పరాభవాలు ఎదుర్కొన్నారు.

మోహన్ బాబు ఘన వారసత్వాన్ని అందుకుని తెరంగేట్రం చేసిన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్న సైతం విజయవంతం కాలేకపోయారు. అందులోనూ గత కొన్నేళ్లలో మంచు ఫ్యామిలీ నటీనటుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. మనోజ్, లక్ష్మీప్రసన్న సినిమాలు బాగా తగ్గించేయగా.. విష్ణు మాత్రం అప్పుడప్పడూ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాటికి తిరస్కారం తప్పట్లేదు. గత ఏడాది విష్ణు నుంచి వచ్చిన ‘జిన్నా’ డిజాస్టరే అయింది. అంతకుముందు మోహన్ బాబు సినిమా ‘సన్నాఫ్ ఇండియా’ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది.

ఈ ఫలితాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఓపెన్ అయ్యారు. ‘జిన్నా’ లాంటి సినిమా ఆడకపోవడం తననెంతో బాధించినట్లు చెప్పారు. “ఒకప్పుడు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్లో నేను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు అదే బేనర్లో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. నేను హీరోగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ ఒక ప్రయోగాత్మక చిత్రం. ఆ సినిమాకు ప్రతికూల ఫలితం రావడం గురంచి పెద్దగా పట్టించుకోను. కానీ ‘జిన్నా’ సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. మంచు విష్ణు కెరీర్లోనే బెస్ట్ ఫిలిం. ఆ సినిమా ఆడకపోవడం నాకెంతో బాధ కలిగించింది” అని మోహన్ బాబు అన్నారు.

మెగాస్టార్ చిరంజీవితో విభేదాల గురించి మాట్లాడుతూ.. తామిద్దరం ఎప్పుడు ఎదురు పడినా బాగానే మాట్లాడుకుంటామని, తమవి గిల్లికజ్జాల్లాంటివని.. అంతే తప్ప వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య గొడవలేమీ లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమ కుటుంబం గురించి వచ్చే ట్రోల్స్‌ను తాను అస్సలు పట్టించుకోనని మోహన్ బాబు చెప్పారు.