పాతికేళ్లకు పైగా సాగుతున్న కెరీర్లో పవన్ కళ్యాణ్ పట్టుమని 30 సినిమాలు కూడా చేయలేదు. మిగతా హీరోలతో పోలిస్తే పవన్ సినిమాల సగటు చాలా తక్కువే. ఐతే ఇంత తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా.. అందులో దాదాపు అరడజను త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ఉన్నవే. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన పవన్.. ఆయన రచనతో వచ్చిన తీన్‌మార్, భీమ్లా నాయక్ చిత్రాల్లోనూ నటించాడు. వినోదియ సిత్తం రీమేక్ సైతం త్రివిక్రమ్ రచనతో తెరకెక్కుతున్న సినిమానే.
కాగా వీరి కలయికలో త్వరలో ఇంకో సినిమా వచ్చే అవకాశముంది. ఈ సినిమా రీమేక్ కాదు. అలా అని ఆ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయట్లేదు కూడా. తొలిసారిగా త్రివిక్రమ్ పవన్ కోసం రాసిన సొంత కథను పమరో దర్శకుడు తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ దర్శకుడు ఎవరో కాదు.. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ. తొలి చిత్రం తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన సుధీర్.. త్వరలో రావణాసురతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు కథ అందించింది శ్రీకాంత్ విస్సా. కాగా పవన్ కోసం త్రివిక్రమ్ రాసిన ఒక కథకు సంబంధించి లైన్ తనకు చెప్పాడని.. అది తనకెంతో నచ్చిందని.. ఆ కథను డైరెక్ట్ చేయాలని తనకు త్రివిక్రమ్ చెప్పాడని సుధీర్ వెల్లడించాడు.
సుధీర్ వర్మ టేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది కానీ.. అతడికి స్క్రిప్టులే సమస్య. త్రివిక్రమ్ లాంటి వాడు మంచి కథ ఇస్తే.. పవన్ లాంటి పెద్ద స్టార్‌ను సుధీర్ బాగానే ప్రెజెంట్ చేసే అవకాశముంది. ఐతే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలనే పవన్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియట్లేదు. మరి సుధీర్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. అన్నీ కుదిరితే సితార ఎంటర్టైన్మెంట్స్‌లో ఈ సినిమా ఉంటుందేమో.