బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఓటిటికి ఇచ్చేశారు

ఎంత స్టార్ అయినా సరే తన సినిమాలను ప్రేక్షకులు మరీ దారుణంగా తిరస్కరిస్తుండటంతో అక్షయ్ కుమార్ కి జ్ఞానం బోధపడినట్టు ఉంది. థియేటర్ కు వర్కౌట్ కావని తెలిసిన సినిమాలను నేరుగా ఓటిటి రిలీజ్ కు ఇచ్చేలా నిర్మాతలను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ఇతను నటిస్తున్న ఓ మై గాడ్ 2 ని డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఫైనల్ చేశారట. మొదటి భాగం తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో గోపాల గోపాలగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో ఉపేంద్ర సుదీప్ లు నటించారు. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది కానీ ఒరిజినల్ మాత్రం క్లాసిక్ అయ్యింది.

ఫస్ట్ పార్ట్ లో అక్షయ్ పరేష్ రావల్ ల నటన అద్భుతంగా పండటంతో పాటు అందులోని డ్రామా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఆ నమ్మకంతోనే రెండో భాగాన్ని మొదలుపెట్టారు. ఈసారి కృష్ణుడి పాత్రను శివుడిగా మార్చేశారు. కథ కూడా కొత్తదే. కొనసాగింపు కాదు. ఈ హక్కులను టైఅప్ తో ఒకే బ్రాండ్ గా మారబోతున్న జియో సినిమా ఊట్ లు సంయుక్తంగా కొనుగోలు చేశాయని ముంబై టాక్. ఎంత మొత్తానికి అనేది బయటికి రాలేదు కానీ చాలా క్రేజీ ఆఫర్ అయితే ఇచ్చారట. గతంలో అక్షయ్ కుమార్ కట్ పుత్లీ, లక్ష్మి బాంబ్, ఆత్ రంగీరే లు నేరుగా స్మార్ట్ స్క్రీన్ పై వచ్చాయి.

ఈ లెక్కన ఇప్పుడీ సీక్వెల్ నిజంగా బాగున్నా రీమేక్ అవకాశాలు లేనట్టే. ఎందుకంటే నేరుగా యాప్ లో కోట్లాది ఆడియన్స్ చూసేస్తారు కాబట్టి ఎంతలేదన్నా ఆసక్తి తగ్గిపోతుంది. ఓ మై గాడ్ 2 ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందట. రెండు నెలల క్రితం అజయ్ దేవగన్ థాంక్ యు గాడ్ వచ్చింది. ఫ్లాప్ అయ్యింది. లైన్ పరంగా కొంచెం పోలికలు వచ్చే అవకాశం ఉండటంతో ఫైనల్ గా ఓటిటికే మొగ్గు చూపారని తెలిసింది. పారితోషికాలు వస్తున్నాయి ఒంట్లో శక్తి ఉందని వరసగా సినిమాలు చేసుకుంటూ పోతే ఇదిగో ఇలాంటి షాకులే తగులుతాయి.