క్లాసు మాసు సినిమాలున్నా బుకింగ్స్ లేవేంటబ్బా

రేపు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలైతే ఉన్నాయి కానీ దేనికీ పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం ట్రేడ్ ని టెన్షన్ లో పెడుతోంది. ఎందుకంటే గత రెండు వారాలుగా చాలా థియేటర్లు కనీస ఫీడింగ్ లేక ఇబ్బంది పడుతున్నాయి. బలగం తెలంగాణలో సాలిడ్ గా రన్ అవుతుండగా ఏపీలో మాత్రం బాగా నెమ్మదించింది. సార్ ఆల్రెడీ స్లో అయిపోవడంతో పాటు రేపటి నుంచి ఓటిటిలో వచ్చేస్తుంది కాబట్టి ఇక దాన్నుంచి ఆశించడానికి ఏమీ లేదు. హిందీ మూవీ తూ ఝూటి మై మక్కర్ డీసెంట్ గానే ఉన్నా దాని వసూళ్లు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు చేశారు కానీ అవేవీ బజ్ ని తీసుకురాలేదు. మాములుగా పబ్లిసిటీ విషయంలో అగ్రెసివ్ గా ఉండే నాగ శౌర్య ఎందుకో ఈసారి దూకుడు తగ్గించాడు. కంటెంట్ మాట్లాడుతుందనే నమ్మకమో లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఇక ప్యాన్ ఇండియా రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన కబ్జ పరిస్థితి సోసోగానే ఉంది. కర్ణాటకలోనే చెప్పుకోదగ్గ బజ్ లేనప్పుడు ఇతర డబ్బింగ్ వెర్షన్ల నుంచి ఏం ఆశిస్తాం. కెజిఎఫ్ పోలికలు ప్రభావం చూపిస్తున్నాయి.

వీటికే ఇలా ఉంటే గణ అనే చిన్న సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. అన్ని తరగతుల పిల్లల పరీక్షలు పీక్స్ లో జరుగుతుండటంతో దాని ఎఫెక్ట్ థియేటర్ల మీద తీవ్రంగా ఉంది. జనాలు హాళ్లకు వచ్చే మూడ్ లో లేరు. దానికి తగ్గట్టే పబ్లిక్ కి రీచ్ అయ్యేలా నిర్మాతలు సరైన మార్కెటింగ్ చేయకపోవడం మరో అడ్డంకిగా నిలుస్తోంది. అనూహ్యంగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప వీకెండ్ ని ఇవి వాడుకోలేవు. హాలీవుడ్ మూవీ షజమ్ ఫ్యూరీ అఫ్ ది గాడ్స్, రాణి ముఖర్జీ హిందీ చిత్రం మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేల స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది.