ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ ఆ చిత్రం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ వస్తుండటం విశేషమే. అందులోనూ ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎక్కడా చూసినా ఈ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మన సినిమా గురించి ప్రపంచమంతా ఇలా మాట్లాడుకుంటుండటం విశేషమే. ఈ సందర్భంలోనే ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంగా ఆయన ఏం చెప్పారో.. సరిగ్గా అదే విషయాన్ని తన కొడుకు, ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి దగ్గర హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్‌బర్గ్ కూడా చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించడం విశేషం.
నేను కొంత కాలం కిందట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశాను. నాతో ఆయన నాలుగు నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నా. కానీ మా సమావేశం 40 నిమిషాలు సాగింది. ఆ నలభై నిమిషాలు.. ప్రపంచం మొత్తం మన దేశం వైపు ఎలా చూడాలి అనే దాని గురించే చర్చించుకున్నాం. మోడీ గారి విజన్‌కు నేను ఆశ్చర్యపోయా. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని.. దాన్ని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని ఆయన అన్నారు.
ఇక రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం ఆమెరికాకు వెళ్లినపుడు స్పీల్‌బర్గ్‌ను కలవగా.. సరిగ్గా ఆయన కూడా ఇదే విషయం చెప్పినట్లు నాతో అన్నాడు. భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా.. ప్రపంచానికి ఇక్కడి సంస్కృతి గురించి తెలిసేలా సినిమాలు తీయాలని రాజమౌళికి స్పీల్‌బర్గ్ సూచించినట్లు తెలిసింది. మోడీ నాకు చెప్పిన విషయమే.. స్పీల్‌బర్గ్ రాజమౌళికి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్ఆర్ఆర్ విజయం వెనుక తమ కుటుంబానికి చెందిన మూడు తరాల వారి కృషి ఉండటం తనకెంతో ఆనందాన్ని కలిగించే విషయమని విజయేంద్ర ఈ సందర్భంగా చెప్పారు.