కొడితే.. రేంజే మారిపోతుంది


నేచురల్ స్టార్ నాని ఇప్పటిదాకా రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు కానీ.. కమర్షియల్‌గా అవన్నీ కూడా ఒక స్థాయిలోనే ఉన్నాయి. ‘భలే భలే మగాడివోయ్’తో చిన్న స్థాయి నుంచి ఒకేసారి కొన్ని మెట్లు ఎక్కేసిన నాని.. ఆ తర్వాత ఆ రేంజే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. తన సినిమాల బడ్జెట్లు.. బిజినెస్‌.. ఓపెనింగ్స్.. ఓవరాల్ వసూళ్లు.. ఇవన్నీ కూడా మిడ్ రేంజ్‌లో కొనసాగుతూ వచ్చాయి. హిట్టయితే ఇంత.. ఫ్లాప్ అయితే ఇంత అని ఒక లెక్క ఉండేది. చాలా ఏళ్ల నుంచి ఈ రేంజిలోనే నాని కొనసాగుతూ వచ్చాడు.

ఐతే ఇప్పుడు నాని కెరీర్‌ను.. అతడి బాక్సాఫీస్ లెక్కల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లే సినిమాలా ‘దసరా’ కనిపిస్తోంది. ఈ సినిమా మేకింగ్ దశలోనే స్థాయిని పెంచుకుంది. నాని మార్కెట్ స్థాయిని మించి బడ్జెట్ పెట్టేశాడు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆ మొత్తం 60 కోట్లని వార్తలు రావడం పెద్ద షాక్.

ఐతే టీజర్ రిలీజైన దగ్గర్నుంచి సినిమాకు హైప్ అనూహ్యంగా పెరిగిపోవడం.. థియేట్రికల్ హక్కులతో పాటు ఇతర రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. ఊహించని విధంగా బిజినెస్ రూ.80 కోట్ల స్థాయికి వెళ్లిపోయింది. సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ప్రమోషన్ల జోరు బాగా పెంచింది నాని అండ్ కో. పాన్ ఇండియా స్థాయిలో హైప్ తేవడానికి గట్టిగా కృషి జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్ మాస్‌కు బాగానే ఎక్కేసినట్లు కనిపిస్తోంది. నానిని మాస్ హీరోగా చూడడమే అరుదు అనుకుంటే.. అతను ఊర మాస్‌గా కనిపించేశాడు.

సినిమాకు ఓపెనింగ్స్ వరకు గట్టిగానే వచ్చేలా కనిపిస్తోంది. టాక్ బాగుంటే.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. ఇతర భాషల్లో ఓ మోస్తరుగా ప్రభావం చూపినా చాలు సినిమా రేంజే కాదు.. నాని కెరీర్ స్థాయి కూడా ఒక్కసారిగా మారిపోతుంది. మిడ్ రేంజ్, టాప్ లీగ్‌కు మధ్యలో నాని ఒక కొత్త లీగ్‌లోకి అడుగు పెడతాడనడంలో సందేహం లేదు.