ఆ సినిమా గ‌ట్టెక్కేసింది


బాలీవుడ్లో ర‌ణ‌బీర్ క‌పూర్-శ్ర‌ద్ధా క‌పూర్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా.. తూ జూతి మై మ‌క్క‌ర్. రొమాంటిక్ సినిమాల‌కు పెట్టింది పేరైన ల‌వ్ రంజ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ కాంబినేష‌న్లో సినిమా అన్న‌పుడు మంచి క్రేజే క‌నిపించింది. పైగా బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత ర‌ణ‌బీర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వ‌స్తాయ‌ని అనుకున్నారు.

కానీ తొలి రోజు ఈ చిత్రానికి ఓ మోస్త‌రు టాక్ రాగా.. వ‌సూళ్లు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు రాలేదు. ఇండియాలో ఆరు కోట్ల లోపే నెట్ వ‌సూళ్లు వ‌చ్చాయి. హోళి సెల‌వు రోజు ఇలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా ఇంకేం నిల‌బ‌డుతుందిలే అనుకున్నారు అంతా. కానీ ర‌ణ‌బీర్ స్టార్ ప‌వ‌ర్, శ్ర‌ద్ధా గ్లామ‌ర్ సినిమాకు బాగానే క‌లిసొచ్చాయి. సినిమా నెమ్మ‌దిగా పుంజుకుంది.

వీకెండ్లో తూ జూతి మై మ‌క్క‌ర్ వ‌సూళ్ల‌లో బిగ్ జంప్ క‌నిపించింది. శ‌ని, ఆదివారాల్లో దాదాపు 30 కోట్ల దాకా ఈ సినిమా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. మొత్తంగా ఈ సినిమా వ‌సూళ్లు రూ.75 కోట్ల మార్కును దాటేశాయి. ఫుల్ ర‌న్లో వంద కోట్ల మార్కును కూడా ట‌చ్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక రొమాంటిక్ మూవీకి వంద కోట్ల వ‌సూళ్లు రావ‌డం అంటే విశేష‌మే. అందులోనూ బాలీవుడ్ సినిమాల మార్కెట్ క‌రోనా త‌ర్వాత ఎంత‌గా దెబ్బ తినేసిందో తెలిసిందే.

తొలి రోజు లో బ‌జ్, ఓపెనింగ్స్‌తో మొద‌లైన సినిమా ఇలా పుంజుకుని వంద కోట్ల రేంజికి వెళ్ల‌డం అంటే మిరాకిల్ అనే చెప్పాలి. బ్ర‌హ్మాస్త్ర బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డం వ‌ల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ.. ఆ సినిమాకు కూడా మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇప్పుడు తూ జూతి మై మ‌క్క‌ర్ కూడా హిట్ అయిన‌ట్లే. ఈ ఫ‌లితాలు ర‌ణ‌బీర్ త‌ర్వాతి సినిమా యానిమ‌ల్‌కు బాగానే క‌లిసొస్తాయ‌న‌డంలో సందేహం లేదు.