శత్రువులపై మొరటోడి ఊచకోత దసరా

Dasara Trailer | Nani | Keerthy Suresh | Santhosh  Narayanan | Srikanth Odela | SLV Cinemas

జనవరిలో సంక్రాంతి హడావిడి తర్వాత సరైన మాస్ సినిమా రాలేదని ఎదురు చూస్తున్న టైంలో మార్చి 30న ఊర మాస్ అవతారంలో న్యాచురల్ స్టార్ నాని దసరాతో రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ తో మొదలుకుని టీజర్ దాకా దీని మీద ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. దానికి తోడు నాని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లక్నో, చెన్నై, కోచి లాంటి నగరాలకు వెళ్లి మరీ ప్రమోట్ చేయడంతో క్రమంగా అంచనాలు ఎగబాకుతున్నాయి. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ రా ఇంటెన్స్ డ్రామా తాలూకు ట్రైలర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

చుట్టూ బొగ్గు గనులుండే తెలంగాణాలోని చిన్న కుగ్రామంలో ఉండే ధరణి(నాని)కి ఆ ఊరే ప్రపంచం. పని చేయడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, అడ్డొచ్చినోడిని కొట్టడం ఇదే వాడి దినచర్య. వెన్నెల(కీర్తి సురేష్)తో లగ్గం పెడతారు పెద్దలు. ఎంత మొరటోడైనా ధరణి మంచోడే. కానీ అంతా బాగుందనుకుంటున్న సమయంలో అక్కడికి రాజకీయం, పోలీస్ జులుం వస్తుంది. అరాచకం మొదలవుతుంది. దీంతో ధరణి కత్తి పట్టాల్సి వస్తుంది. బామ్మ వద్దని నెత్తినోరు బాదుకున్నా తలలు తెగడం రక్తం ఏరులై పారడం చూస్తారు. అసలు ధరణి జీవితంలో రేగిన అలజడికి సమాధానమే దసరా

నోట్లో బీడి, మాసిపోయిన బనీను చొక్కా లుంగీ, తైలసంస్కారం లేని గెడ్డం, క్రాఫు లేని జుట్టు ఇలా కమర్షియల్ మీటర్ ని నూటా యాభై స్పీడుతో పెంచేసిన లుక్ లో నాని విశ్వరూపమే చూపించాడు. ముఖ్యంగా తగ్గదేలే టైపులో బెంచోత్ అంటూ తనదైన యాసలో పలికే డైలాగు బాగా పేలింది. నాటు నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టెర్రిఫిక్ అనిపించే విజువల్స్ ని ప్రెజెంట్ చేశాడు. సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్ వెరసి ఆశించినట్టే దసరా మాస్ ఆడియన్స్ కి మంచి బిర్యానీ మీల్స్ లా కనిపిస్తోంది. ఇదే సినిమా మొత్తం ఉంటే బ్లాక్ బస్టర్ పడినట్టే