అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రాలతో తనపై అంచనాలు పెంచిన దర్శకుడు హను రాఘవపూడి. కానీ ఆ అంచనాలకు ఏమాత్రం తగని సినిమాలతో తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడతను. భారీ బడ్జెట్లలో అతను తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు దారుణమైన ఫలితాలందుకుని నిర్మాతల్ని ముంచేశాయి.
ముఖ్యంగా ‘పడి పడి..’తో హనుకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో అతడికి తర్వాతి సినిమా చేసే అవకాశం వచ్చింది. వైజయంతి సమర్పణలో స్వప్న సినిమా బేనర్ మీద హను దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని మంగళవారమే ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆసక్తికర ప్రి లుక్ పోస్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
1964 ప్రాంతంలో జరిగిన ఇండియా-చైనా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనున్న ప్రేమకథ ఇదని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ‘మహానటి’తో పీరియడ్ సినిమాలు తీయడంలో ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన వైజయంతీ-స్వప్న సంస్థలు ఈసారి వేరే నేపథ్యం తీసుకుని మరో విభిన్నమైన పీరియడ్ ఫిలిం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రి లుక్ పోస్టర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేలాగే ఉంది.
ఇదిలా ఉంటే.. హను గురువు అయిన విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కెరీర్ ఆరంభంలో ఒక వార్ ఫిలిం చేయాలని ఆశపడ్డాడు. ఉదయ్ కిరణ్ హీరోగా ఆ సినిమాను మొదలు పెట్టాడు కూడా. అందులో ఉదయ్‌ను సైనికుడిగా చూపించనున్నట్లు కూడా ప్రారంభోత్సవం రోజే ప్రకటించాడు. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది. కట్ చేస్తే యేలేటి శిష్యుడు వార్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయబోతున్నాడు. బహుశా గురువు నుంచే స్ఫూర్తి పొంది హను.. ఆయన చేయలేకపోయినది తాను చేస్తున్నాడేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates