ఇన్నేళ్ల శ్రమకు అంత పెద్ద రిస్కా

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ కొత్త సినిమా రంగమార్తాండ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది. కొందరు సెలబ్రిటీలకు వేసిన స్పెషల్ ప్రీమియర్ల నుంచి టాక్ చాలా పాజిటివ్ గా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంల నటన గురించి సోషల్ మీడియాలో పేరాల కొద్దీ పోస్టులు, ట్వీట్లు కనిపిస్తున్నాయి. నిజానికి దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని థియేటర్లలోకి పంపుతున్నారు.

మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అంతా బాగానే ఉంది ఫిబ్రవరి నుంచి ఈ నెల రెండో వారం దాకా ఖాళీగా ఉన్న ఎన్నో డేట్లను వదిలేసి ఇప్పుడా తేదీని తీసుకోవడం రిస్క్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీని ఆల్రెడీ లాక్ చేశారు. భీభత్సమైన అంచనాలు లేకపోయినా పక్కా ప్రమోషన్ల ప్లానింగ్ తో మాస్ లో అంచనాలు పెంచేలా స్కెచ్ రెడీ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా తీసుకురావడం అందులో భాగమే. ఇంకోవైపు హాలీవుడ్ మూవీ జాన్ విక్ చాప్టర్ 4 నగరాల్లో ప్రభావం చూపిస్తుంది.

అసలు సమస్య మరొకటుంది. 30న నాని దసరాని న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధం చేశారు. ట్రేడ్ కు దీని మీద విపరీతమైన అంచనాలున్నాయి. మాస్ సినిమా వచ్చి రెండు నెలలు దాటిపోవడంతో థియేటర్లకు ఆడియన్స్ పోటెత్తుతారనే విశ్లేషణలు జోరుగా ఉన్నాయి. అవే స్థాయిలో ఉంటాయనేది 14న వచ్చే ట్రైలర్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. రంగమార్తాండ లాంటి సాఫ్ట్ కంటెంట్ వీటి మధ్య నెగ్గుకురావాలి. మరాఠి సూపర్ హిట్ నటసామ్రాట్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మీద కృష్ణవంశీ భవిష్యత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.