ఆస్కార్‌లో ‘నాటు’ పెర్ఫామెన్స్ లేదా?


భారతీయుల దృష్టి మునుపెన్నడూ లేని స్థాయిలో ఈసారి ‘ఆస్కార్’ అకాడమీ అవార్డుల మీద నిలిచి ఉంది. అందుక్కారణం.. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారానికి గట్టి పోటీదారుగా మారడమే. తుది జాబితాలో చోటు సంపాదించిన ఈ పాటకు.. ఆస్కార్ అవార్డు రావడం పక్కా అనే నమ్మకంతో టీం ఉంది. అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీంలోని ప్రధాన వ్యక్తులు హాజరవుతుండడం.. వాళ్లు రెడ్ కార్పెట్ మీద నడవబోతుండటమే పెద్ద గౌరవంగా భావిస్తున్నారు.

ఇక అవార్డుల వేడుకలో కీరవాణి తన టీంతో కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండడం కూడా ఖరారైంది. కాగా ఇదే వేదిక మీద హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఇస్తారనే అంచనాలతో అభిమానులు ఉన్నారు. ఈ దిశగా వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఈ వేడుక ముంగిట ఓ హాలీవుడ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తారక్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఆస్కార్ వేదిక మీద నాటు నాటు స్టెప్పులు చూడడం సందేహంగానే ఉంది. మీ లైవ్ పెర్ఫామెన్స్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు తారక్ సమాధానం చెబుతూ.. అందుకు అవకాశం లేనట్లే మాట్లాడాడు. “మేం ఆ పాటకు డ్యాన్స్ చేస్తామని కచ్చితంగా చెప్పలేం. నాకు, రామ్ చరణ్‌కు రిహార్సల్స్ చేసే సమయం లేదు. అందుకే మేం ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయడం అనుమానమే. కానీ ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి” అని తారక్ అన్నాడు.

ఐతే తారక్, చరణ్ నిజంగానే ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేయరా.. లేరంటే ముందు ఇలా చెప్పి సర్ప్రైజ్ లాగా డ్యాన్స్‌తో అలరిద్దామనే ఉద్దేశంతో తారక్ ఆ మాట అన్నాడా అన్నది తెలియదు. కానీ ఆస్కార్ వేదిక మీద తారక్, చరణ్ డ్యాన్స్ చేస్తే మాత్రం అది భారతీయులు గర్వించే మూమెంట్ అవుతుందనడంలో సందేహం లేదు.