నయనతార జోడిగా లారెన్స్ మాస్టర్

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న నయనతార ఒక షాకింగ్ కాంబినేషన్ కి ఒప్పుకున్నట్టు చెన్నై టాక్. లారెన్స్ రాఘవేంద్రతో మొదటిసారి ఓ హారర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. రత్న కుమార్ దర్శకుడిగా నిర్మించబోతున్నారు. ఇతను ఇప్పటిదాకా మూడు సినిమాలు డైరెక్ట్ చేశాడు. బెంచ్ టాకీస్, మీయద మాన్ రెండూ మంచి విజయం సాధించాయి కానీ తెలుగులో డబ్ కాలేదు. గులు గులు ఆశించిన విజయం సాధించలేదు. కేవలం వీటి ఆధారంగా ఇతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రచయితగా ట్రాక్ రికార్డు అలాంటిది మరి.

కమల్ హాసన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విక్రమ్ కు రచన చేసింది ఇతనే. విజయ్ మాస్టర్, ఇప్పుడు నిర్మాణంలో లియోకు ఈ రత్న కుమార్ కలమే దన్నుగా నిలిచింది. వీటికి కో రైటరే అయినప్పటికీ లోకేష్ కనగరాజ్ తో మంచి బాండింగ్ ఉంది. లారెన్స్ కలయికతో చెప్పిన లైన్ నయన్ కు బాగా నచ్చడంతో ఎక్కువ ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దెయ్యాల కథలు నయన్ కు కొత్తేమి కాదు. కనెక్ట్, డోరా, ఐరా ఇలా హారర్ బ్యాక్ డ్రాప్ లో తనవి చాలానే వచ్చాయి. ఇక లారెన్స్ గురించి తెలిసిందే. ప్రేతాత్మలంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు.

తన పక్కన నటించే హీరో ఇమేజ్ అందం గురించి పట్టించుకోకుండా నయన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. విగ్నేష్ శివన్ తో పెళ్లి, ఆ తర్వాత పిల్లలు ఇలా కొంచెం గ్యాప్ తీసుకున్న నయనతార ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ లో చేసింది కానీ అదేమంత అద్భుతాలు చేయలేకపోయింది. ఇక లారెన్స్ వచ్చే నెల 14న రుద్రుడుతో రాబోతున్నాడు. ఇదీ దెయ్యాల గోలే. చంద్రముఖి 2 నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఎవరితో చేసినా ఎవరితో తీసినా హారర్ తప్ప మరొక మాట లేదంటున్న లారెన్స్ తో నయన్ జోడి తెరమీద ఎలా ఉండబోతోందో చూడాలి.