కొన్ని సార్లు మరీ స్పీడుగా వెళ్ళినా మొదటికే మోసం వస్తుంది. ఏ హీరో నుండైనా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలొస్తే పరవాలేదు అదే రెండు నెలలకో సినిమా అంటే ట్రోలింగ్ కి గురవ్వక తప్పదు. అదీ వరుస ఫ్లాఫ్స్ అందుకుంటూ ఇలా తక్కువ గ్యాప్ లో థియేటర్స్ లోకి వస్తే ప్రేక్షకులకు కూడా విసుగొస్తుంది.
ప్రెజెంట్ కొందరు యంగ్ హీరోల తీరు చూస్తుంటే అలాగే ఉంది. కిరణ్ అబ్బవరం తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. సార్ సినిమాతో పోటీ పడి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఈ లోపే మరో సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు కిరణ్. ‘మీటర్’ అనే సినిమాతో ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ వచ్చిన తక్కువ గ్యాప్ లోనే ‘వినరో’ సినిమాతో పలకరించాడు కిరణ్. ఇప్పుడు మార్చ్ నుండి ఏప్రిల్ లోపే మరో సినిమా రెడీ చేస్తుండటంతో ఈ కుర్ర హీరోను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా రెండు నెలలకో సినిమాతో వస్తూ ఆడియన్స్ కి మొనటనీ అవుతున్నాడు.
సాయి కుమార్ తనయుడు కూడా ఇంతే. నెలలో ఓ సినిమా లేదా సిరీస్ తో ప్రేక్షకుల ముందకొస్తూనే ఉన్నాడు. గతేడాది ఆది సాయి కుమార్ నుండి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. డిసెంబర్ లో ‘టాప్ గేర్’ అనే సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్న ఆది ఇప్పుడు మార్చ్ లో csi సనాతన్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. అంటే మూడు నెలల్లోపే ఆది నుండి మరో సినిమా వస్తుందన్నమాట. ఈ ఏడాది అరడజను సినిమాలతో తన రికార్డ్ ను తనే బ్రేక్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆది.
ఇక సంతోష్ శోభన్ కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో థియేటర్స్ లోకి వస్తూనే ఉన్నాడు. నవంబర్ 4 న ‘లైక్ షేర్ సబ్ స్క్రయిబ్’ అనే సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు సంతోష్. ఆ వెంటనే జనవరిలో సంక్రాంతికి కళ్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు కుర్ర హీరోకి పరాజయాన్ని అందించాయి. ఇప్పుడు ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ సమ్మర్ లోనే సినిమా విడుదల కానుంది. అంటే సంతోష్ కూడా రెండు మూడు నెలల్లోనే ఓ సినిమాతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు.
ఏదేమైనా కుర్ర హీరోలు ఇలా వరుస సినిమాలతో రెండు నెలల మూడు నెలల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల కౌంట్ పెరగడం తప్ప మరో లాభం లేదు. పైగా వరుస డిజాస్టర్స్ , ఫ్లాఫ్స్ సినిమాలతో ఇలా పదే పదే ప్రేక్షకులను విసిగిస్తే ఇకపై ఈ హీరోల సినిమాలకు మినిమం మార్కెట్ కూడా ఉండకపోవచ్చు. వీరి సినిమాలకు ప్రేక్షకులూ దూరమయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఈ యంగ్ హీరోలు ఏడాదికి అరడజను సినిమాలతో కౌంట్ పెంచుకుంటూ పోవడం కాకుండా క్వాలిటీ సినిమాలు ఇస్తూ ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో సరిపెట్టుకుంటూ బెటర్.