ఒకేసారి ఆర్సీ 15 టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, రిలీజ్ డేట్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ లీడ్ రోల్ చేస్తున్న కొత్త సినిమా మీద భారీ అంచ‌నాలే ఉన్నాయి. త‌మిళ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు భారీ బ‌డ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముందు అనుకున్న ప్ర‌కారం అయితే ఈ పాటికే రిలీజ్ కావాల్సింది కానీ.. శంక‌ర్ ఇండియ‌న్-2ను పునఃప్రారంబిచంఆల్సి రావ‌డంతో ఆల‌స్యం త‌ప్ప‌లేదు.

వ‌చ్చే సంక్రాంతికి రిలీజ‌వుతుంద‌ని భావిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ చిత్ర టైటిల్ గురించి అభిమానులు తెగ చ‌ర్చించేసుకుంటున్నారు. సీఈవో (చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్) అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు జోరుగా వ‌స్తున్నాయి. కాగా అభిమానుల్లోని ఈ ఉత్కంఠ‌కు మ‌రి కొన్ని రోజుల్లోనే నిర్మాత దిల్ రాజు తెర‌దించేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ వివ‌రాల‌ను ఒకేరోజు ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. అందుకోసం మంచి ముహూర్తం చూస్తున్న‌ట్లు తెలిసింది. ఈ నెల 22న ఉగాది సంద‌ర్భంగా కానీ.. లేదంటే 26న చ‌ర‌ణ్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని కానీ ఈ విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకోనున్నార‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు ఈ మేర‌కు క్లారిటీ కూడా ఇచ్చేశారు. కాబ‌ట్టి చ‌ర‌ణ్ అభిమానులు ఈ నెల‌లో ట్రిపుల్ ట్రీట్ ఖాయం అన్న‌మాటే.

ఈ సినిమాకు సేనాని అనే మ‌రో టైటిల్ కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌గా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఈ సినిమాను ఇంకా పెద్ద రేంజికి తీసుకెళ్లాల‌నే ఉద్దేశంతో రాజు ఉన్నాడు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అద్వానీ న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. సునీల్, శ్రీకాంత్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.