బన్నీతో సాయిపల్లవి.. నో ఛాన్స్

రెండు రోజుల నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జట్టు కట్టబోతోందని.. బన్నీ ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప-2’లోనే ఆమె భాగం కాబోతోందన్నది ఆ వార్త. ఫస్ట్ పార్ట్‌లో రష్మిక మందన్నా కథానాయికగా కనిపించగా.. రెండో భాగంలోనూ ఆమె కొనసాగుతోంది.

మళ్లీ కొత్తగా సాయిపల్లవి కోసం ఒక పాత్ర సృష్టించారని.. ఈ పాత్రను ఆమెకు ఆఫర్ చేయగానే ఓకే చెప్పేసిందని.. త్వరలో షూటింగ్‌కు కూడా హాజరు కాబోతోందని రూమర్ రాయుళ్లు వార్తలు అల్లేశారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే ఈ వార్త నిజమేనా అని ‘పుష్ప-2’ టీం సభ్యుడు ఒకరిని అడగ్గా.. అది జస్ట్ రూమర్ మాత్రమే అని, అందులో ఎంతమాత్రం నిజం లేదని.. సినిమాలో ఇంకో హీరోయిన్ పాత్రకు ఛాన్సే లేదని తేల్చేశారు.

లాజికల్‌గా ఆలోచిస్తే సాయిపల్లవి ఈ సినిమాలో నటించేందుకు ఛాన్సే లేదని అర్థమైపోతుంది. సాయిపల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి పెర్ఫామర్.. సుకుమార్ సినిమాలో ఒక పాత్ర చేసిందంటే అది మామూలుగా హైలైట్ అవదు. అప్పుడు రష్మిక మందన్నా చేసిన హీరోయిన్ పాత్ర కచ్చితంగా మరుగున పడిపోతుంది.

ఫోకస్ అంతా సాయిపల్లవి మీదికి వెళ్లిపోతుంది. అప్పుడు హీరో-విలన్ పాత్రలు కూడా కొంచెం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ హీరోయిన్ కాకుండా అనసూయ రూపంలో ఒక కీలకమైన లేడీ క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర రెండో భాగంలో కూడా కొనసాగుతోంది.

అలాంటపుడు సాయిపల్లవి కోసం ఇంకో పాత్రను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఫస్ట్ పార్ట్‌లో సమంత మాదిరే ఒక స్టార్ హీరోయిన్ ఆ పాటలో మెరవబోతోంది. అది సాయిపల్లవి మాత్రం కాదన్నది స్పష్టం.