బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్‌.. అస్స‌లు క‌లిసి రావ‌ట్లా

ఉప్పెన లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది కృతి శెట్టి. నిజానికి ఈ సినిమా కోసం ముందు ఎంచుకున్న హీరోయిన్ వేరు. ప్రారంభోత్స‌వంలో కూడా ఆ అమ్మాయే పాల్గొంది. కానీ త‌ర్వాత అనూహ్యంగా కృతి లైన్లోకి వ‌చ్చింది. సినిమా రిలీజ్ ఆల‌స్యం అయినా స‌రే.. రిలీజ్ త‌ర్వాత సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కృతికి అదిరిపోయే అప్లాజ్ వ‌చ్చింది.

సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం, త‌న‌కూ పేరు రావ‌డంతో అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి. కానీ రెండో సినిమా శ్యామ్ సింగ‌రాయ్ మాత్ర‌మే బాగా ఆడింది. బంగార్రాజు అంచ‌నాలను అందుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ల‌య్యాయి. ది వారియ‌ర్, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఈ సినిమాలు ఆమె కెరీర్‌ను వెన‌క్కి లాగేశాయి.

త‌ర్వాతి సినిమాల‌తో అయినా కెరీర్ పుంజుకుంటుంద‌నుకుంటే అలాంటి సంకేతాలేమీ క‌నిపించ‌డం లేదు. త‌మిళంలో ఆమెకు వ‌చ్చిన అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే చేజారిపోతున్నాయి. ముందు బాలా ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా తెర‌కెక్క‌నున్న చిత్రానికి కృతిని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. త‌ర్వాత అరుణ్ విజ‌య్ హీరోగా ఓ సినిమాకు కృతిని తీసుకున్నారు. కానీ ఏం జ‌రిగిందో ఏమో.. ఆ సినిమా నుంచి కృతిని త‌ప్పించి రోషిణి ప్ర‌కాష్ అనే క‌న్న‌డ క‌థానాయిక‌ను ఎంచుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఆమె ఆశ‌ల‌న్నీ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తున్న క‌స్ట‌డీ మీదే ఉన్నాయి. అది కూడా తేడా కొడితే కెరీర్ ముందుకు సాగ‌డం క‌ష్ట‌మే. మ‌ల‌యాళంలోనూ టొవినో విజ‌య్ హీరోగా చేస్తున్న ఓ సినిమాకు కృతి క‌థానాయిక‌గా ఎంపికైంది. కానీ ఆమె కెరీర్ అంతా టాలీవుడ్‌లోనే కావ‌డంతో ఇక్క‌డ స‌క్సెస్ కావ‌డ‌మే కీల‌కం.