శాండల్ వుడ్ పూర్తిగా కెజిఎఫ్ మానియాలో మునిగి తేలుతోంది. అలాంటి గ్రాండియర్లు తీస్తేనే ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో అదే తరహా ఆర్ట్ వర్క్, దానికి పని చేసిన సాంకేతిక నిపుణులతోనే భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తోంది. ఇటీవలే ధృవ సర్జా మార్టిన్ టీజర్ చూశాక అదే అనిపించింది. శివరాజ్ కుమార్ వేద సైతం ఆ స్ఫూర్తితో వచ్చిందే. తాజాగా ఈ లిస్టులో వీటిని ఓవర్ టేక్ చేస్తూ కబ్జాని తీసుకురాబోతున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ ఎట్టకేలకు మార్చి 17 విడుదలకు సిద్ధమవుతోంది. మల్టీ లాంగ్వేజెస్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు.
కథ 1945 నేపథ్యంలో స్వతంత్రం రాకముందు మొదలవుతుంది. నడివీధుల్లో ఇద్దరు పిల్లలను పెట్టుకుని అనాథగా మారిన ఓ తల్లి(సుధ) వేదనతో ఆరంభించి వాళ్లలో ఒకడు కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్(ఉపేంద్ర) గా ఎలా మారాడు, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, ఇతని జీవితంలో ఎదురు నిలిచిన పోలీస్ ఆఫీసర్(కిచ్చ సుదీప్)కి ఉన్న సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. విజువల్స్ చాలా టెర్రిఫిక్ గా ఉన్నాయి కానీ దాదాపు అన్ని ఫ్రేమ్స్ లో కెజిఎఫ్ ఛాయలు ఎంత వద్దన్నా కనిపిస్తూనే ఉంటాయి. శ్రేయ, మురళిశర్మ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఉంది.
దర్శకుడు చంద్రు భారీతనాన్ని గ్రాండ్ స్కేల్ లో ప్రెజెంట్ చేశారు. రవి బస్రూరు అందించిన నేపధ్య సంగీతం ఎలివేషన్ కు పనికొచ్చింది కానీ ఇక్కడా పోలికలు చేయకుండా ఉండలేం. అంచనాల సంగతమేమో కానీ మొత్తానికి మాస్ ఆడియన్స్ దీనివైపు ఓ లుక్ వేద్దామా అనిపించేలా యాక్షన్ ఎపిసోడ్లు, వయొలెన్స్ ఉన్నాయి. ఉపేంద్ర క్యారెక్టరైజేషన్, సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. పోటీ లేకుండా మంచి టైమింగ్ తోనే వస్తున్న కబ్జా కనక కంటెంట్ తో మెప్పిస్తే నార్త్ నుంచి సౌత్ దాకా వసూళ్లు లాగేయొచ్చు. ఎటొచ్చి ఇది సరికొత్త అనుభూతినివ్వాల్సిందే.