క్రేజీ డేట్ ప‌ట్టేసిన గోపీచంద్

టాలీవుడ్లో హిట్ చాలా అవ‌స‌ర‌మైన స్థితిలో ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒక‌డు. అత‌ను నిఖార్స‌యిన హిట్ కొట్టి చాలా ఏళ్ల‌యింది. ఎప్పుడో 2014లో రిలీజైన లౌక్యం అత‌డి చివ‌రి సూప‌ర్ హిట్. ఆ త‌ర్వాత అత‌డి సినిమాలేవీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాయి. ఒక్క సీటీమార్ ఓ మోస్త‌రుగా ఆడింది త‌ప్ప‌.. మిగ‌తావ‌న్నీ తుస్సుమ‌నిపించాయి. గ‌త ఏడాది మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో గోపీ మార్కెట్ మీద గ‌ట్టి ప్ర‌భావం ప‌డింది.

కాక‌పోతే ఈసారి అత‌ను త‌నకు ల‌క్ష్యం, లౌక్యం లాంటి సూప‌ర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్‌తో జ‌ట్టు క‌డుతుండ‌డంతో రామ‌బాణం మీద మంచి అంచ‌నాలే ఉన్నాయి. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా తాజాగా విడుద‌ల తేదీని ఖరారు చేసుకుంది.

ఈసారి వేస‌వికి పెద్ద స్టార్ల సినిమాలేవీ లేక‌పోవ‌డం గోపీచంద్‌కు క‌లిసొచ్చింది. మే 5న క్రేజీ డేట్‌ను త‌న సినిమా కోసం బుక్ చేసుకున్నాడు. మిడ్ స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే చాలా మంచి డేట్ అన్న‌ట్లే. రామ‌బాణం చిత్రానికి పెద్ద‌గా పోటీ ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఈ వేస‌విలో వారానికి ఒకటి చెప్పునే సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి ప్ర‌స్తుతానికి. గ‌త ఏడాది కార్తికేయ‌-2, ధ‌మాకా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మించిన చిత్ర‌మిది. ఆ సంస్థ ఉన్న ఊపులో సినిమాను కొంచెం గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేసేలా క‌నిపిస్తున్నారు.

గోపీ-శ్రీవాస్ శైలికి త‌గ్గ‌ట్లే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లున్నారు. పోస్ట‌ర్లు ఆ సంకేతాలే ఇస్తున్నాయి. గోపీ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తి న‌టించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం స‌మ‌కూర్చాడు.