స్టూడెంట్స్ డిమాండ్ చేశారు సార్ సరే అన్నారు 

సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువంచనా వేయడానికి లేదు. ఒక్కోసారి చిన్న వీడియోలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కొన్ని సమస్యలు పరిష్కరిస్తాయి. కొన్ని లేనిపోని రాద్ధాంతాలకు దారి తీస్తాయి. మంచి జరిగితే అదే సంతోషం. గత నెల విడుదలై బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన సార్ ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

శివరాత్రి తర్వాత చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడాన్ని ధనుష్ బాగా వాడుకున్నాడు. వీకెండ్స్ లో సెలవుల్లో కుటుంబ ప్రేక్షకులతో మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. యూత్ కంటే ఎక్కువగా ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతున్నాయి. 

తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ స్కూల్ విద్యార్థులు తమ టీచర్లతో కలిసి సార్ సినిమాని ఉచితంగా చూపించాలంటూ బ్యానర్ కట్టుకుని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. ఆ వీడియో కాస్త ట్విట్టర్ లో వైరల్ అయిపోయింది. తల్లితండ్రుల ఆర్ధిక స్థోమత వల్ల వందా రెండు వందలు కేవలం టికెట్ కే పెట్టలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉండటంతో ఈ రకంగా తమ కోరికను వెలిబుచ్చారు.

ఎట్టకేలకు ఇది నిర్మాతల దాకా వెళ్లిపోయింది. సరే తీసింది వాళ్ళ కోసమే అయినప్పుడు ఫ్రీ షోలు వేయడం న్యాయమేనని భావించి కావాల్సినవాళ్ళు ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తే ఏర్పాటు చేస్తామని స్పందించారు. 

మేకర్స్ వైపు నుంచి ఇది మంచి ఆలోచన. ఎలాగూ సార్ ఇప్పుడు మూడో వారంలో ఉంది. వీక్ డేస్ లో చెప్పుకోదగ్గ డ్రాప్ కనిపిస్తోంది. మళ్ళీ పికప్ అవ్వడం అవ్వకపోవడం పక్కనపెడితే ఇలా చేయడం వల్ల రీచ్ మరింత పెరుగుతుంది.

ఆ మధ్య రైటర్ పద్మభూషణ్ ఇదే తరహాలో మహిళలందరికీ ఫ్రీ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తే దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అయినా న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్స్ లో కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వడం కన్నా ఇలా లక్షల వ్యయంతో ప్రీమియర్లు చూపించడం ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సార్ మరింత నచ్చేస్తున్నాడు