బాలయ్య బ్యాక్ టు బ్యాక్ 50 రోజులు

ఓటిటి జమానా వచ్చేశాక ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే యాభై రోజుల మైలురాయి చాలా అరుదుగా మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా గ్రాండియర్లే హండ్రెడ్ డేస్ చూడలేకపోతున్న ట్రెండ్ లో ఒక కమర్షియల్ సినిమాకు ఫిఫ్టీ డేస్ పోస్టర్ పడటం ఘనతే. దాన్ని రెండు సార్లు సాధించడమంటే అది ఇంకా పెద్ద విశేషం. బాలయ్య అది చేసి చూపించారు. వీరసింహారెడ్డి దిగ్విజయంగా 54 సెంటర్లలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. ఇందులో డైరెక్ట్ 23 కాగా షిఫ్ట్ జరుపుకుని థియేటర్ మారినా రెగ్యులర్ షోలతో ఆడినవి మిగితావి.

విపరీతమైన సంక్రాంతి పోటీ, థియేటర్ల కొరతను తట్టుకుని బాలయ్య ఈ ఫీట్ సాధించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణకు ఇది రెండో యాభై రోజుల బొమ్మ. 2021 డిసెంబర్ లో వచ్చిన అఖండ దీనికన్నా గొప్పగా 103 కేంద్రాల్లో ఆడటం ఇప్పటికీ రికార్డే. అది కూడా డ్రై సీజన్ గా చెప్పుకునే నెలలో వచ్చి ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం గురించి ట్రేడ్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డితో మరోసారి కంటిన్యూ గా దాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడిది కొనసాగిస్తే హ్యాట్రిక్ అవుతుంది.

ఇంత స్పెషల్ గా చెప్పుకోవడానికి కారణం ఉంది. బాలయ్య సమకాలీకుల్లో ఎవరికీ గత కొన్నేళ్లలో ఇలా వరసగా రెండు బ్లాక్ బస్టర్లు లేవు. చిరంజీవికి వాల్తేరు వీరయ్యకు ముందు గాడ్ ఫాదర్ యావరేజ్ కాగా ఆచార్య డిజాస్టర్ అయ్యింది. నాగార్జునకు బంగార్రాజు విజయం తెచ్చిన ఆనందం ది ఘోస్ట్ ఆవిరి చేసింది. వెంకటేష్ ఎఫ్3 సక్సెస్ ని ఎంజాయ్ చేశాక ఓరి దేవుడాతో సోసో ఫలితం అందుకున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్ కథానాయకుడుతో మొదలుపెట్టి రూలర్ దాకా వరస ఫ్లాపులు అందుకున్న బాలయ్య ఇంత పవర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు.