భారం మొత్తం బలగం మీదే

రేపు కొత్త శుక్రవారం కౌంట్ పరంగా రిలీజులైతే ఉన్నాయి కానీ వాటిలో చెప్పుకోదగినది ఒక్క బలగం మాత్రమే. దిల్ రాజు నిర్మాణంలో కమెడియన్ వేణుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు బ్యానర్ సపోర్ట్ తో మంచి విడుదల దక్కుతోంది. గత వారం వచ్చినవి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ప్రేక్షకులకు సార్, వినరో భాగ్యము విష్ణుకథ తప్ప వేరే ఆప్షన్లు లేకుండా పోయాయి. ఇప్పుడా గ్యాప్ ని వాడుకునేందుకు బలగంకు ఛాన్స్ దక్కింది. ఫక్తు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీకి టాక్ కీలకం కానుంది.

హైదరాబాద్ లో సెలబ్రిటీలకు మీడియాకు వేసిన ప్రీమియర్ షోల నుంచి రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది కానీ పబ్లిక్ నుంచి కూడా ఇదే స్పందన వస్తే హిట్టు గ్యారెంటీ. కాకపోతే ఆడియన్స్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంది. కమర్షియల్, మాస్ మసాలా, విజువల్ గ్రాండియర్స్, డిఫరెంట్ జానర్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ వీటిని మాత్రమే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. కానీ బలగం పూర్తిగా వినోదం కన్నా భావోద్వేగాల మీద నడిచే డ్రామా. ఇది కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం ముఖ్యం. అదే జరిగితే రైటర్ పద్మభూషణ్ తరహా సక్సెస్ చూడొచ్చు.

ఇది కాకుండా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, ఇన్ కార్, గ్రంథాలయం, సాచి, రిచి గాడి పెళ్లి కూడా వస్తున్నాయి కానీ వీటి మీద కనీస బజ్ లేదు. మార్నింగ్ షో అయ్యాక బ్రహ్మాండంగా ఉందనే మాట బయటకి వస్తేనే పికప్ అవుతాయి. మొదటిది ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ ఏమైనా జనాన్ని రప్పిస్తుందేమో చూడాలి. శివరాత్రి తర్వాత ఊపిచ్చే సినిమాలేవీ లేకపోవడం కొంత స్తబ్దతకు దారి తీసింది. పిల్లల పరీక్షల సీజన్ కావడంతో పెద్ద నిర్మాతలు సాహసం చేయడం లేదు. మార్చి మూడో వారం నుంచి మళ్ళీ ఊపందుకునేలా ప్లాన్ చేసుకున్నారు.