హిట్టనలేం.. ఫ్లాపూ అనలేం

ఓటీటీలో రిలీజయ్యాక కానీ గుర్తింపు తెచ్చుకోని ‘రాజావారు రాణివారు’ సినిమాతో కథానాయికుడిగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపే సంపాదించిన అతను.. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత తన సినిమాలేవీ ఆశించిన ఫలితాలందుకోలేదు. ‘సమ్మోహనం’ కొంచెం బెటర్.

సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాల దెబ్బకు కిరణ్ కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి కనిపించింది. ఇంకో ఫ్లాప్ పడితే తన పనైపోయే స్థితిలో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేశాడు. చాలా టైం తీసుకుని సినిమాను పూర్తి చేశారు. ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగా రిలీజ్ చేసి శివరాత్రి వీకెండ్లో సినిమాను రిలీజ్ చేశారు.

యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఆ టాక్‌కు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసింది. థియేటర్లేమీ జనాలతో నిండిపోలేదు. అలా అని థియేటర్ల వెలవెలబోనూ లేదు. ఓ మోస్తరు వసూళ్లతో సినిమా ముందుకు సాగింది. ఇదే వీకెండ్లో రిలీజైన ‘సార్’ సినిమా ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ కాగా.. కిరణ్ సినిమాకు ఓ మోస్తరు ఆదరణ దక్కింది.

ముందు, తర్వాతి వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం ‘వినరో భాగ్యము..’కు కలిసొచ్చింది. గట్టి పోటీ ఉంటే సినిమాకు చాలా కష్టమయ్యేది కానీ.. అలా లేకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లు సాధించిందీ సినిమా. పోస్టర్ల మీద వేస్తున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు కానీ.. కలెక్షన్లు పర్వాలేదు.

సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయినట్లే. బయ్యర్లు చిన్న పెట్టుబడులే పెట్టారు కాబట్టి సేఫ్ అయిపోయారు. కానీ పెద్దగా లాభాలైతే రాలేదు. మొత్తానికి కిరణ్ ఖాతాలో ఇంకో ఫ్లాప్ పడకపోవడం ప్లస్ అయింది. ఇది అతడి తర్వాతి సినిమాలకు కలిసొచ్చే విషయమే.