‘తెలంగాణ సినిమా’పై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బలగం.. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సంస్థ నుంచి వస్తున్న కొత్త చిత్రం. జబర్దస్త్ కామెడీ షోతో పాటు కొన్ని సినిమాల్లోనూ కామెడీ పాత్రలతో పేరు తెచ్చుకున్న వేణు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఈ టైటిల్, దీని ప్రోమోలు చూస్తే ఇది పక్కా ‘తెలంగాణ’ సినిమాలా కనిపిస్తోంది.
ఈ శుక్రవారమే ‘బలగం’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఈ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఒక రాజకీయ కార్యక్రమం లాగా మారుస్తూ ఆయన ప్రసంగం సాగడం విశేషం. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష, యాస వినియోగం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవం జరుగుతోంది. అందుకు ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలే ఉదాహరణ. తెలంగాణలో ఇంతమయంది అజ్ఞాత సూర్యులు వెలుగుతున్నారంటే అందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే కారణం. ఒకప్పుడు ఏ భాష, యాస మాట్లాడ్డానికి మొహమాట పడ్డారో.. ఇప్పుడు వాటినే ప్రముఖ నటులు సైతం అన్ని వేదిక మీదా మాట్లాడుతున్నారంటే అందుకు కారకులు ఒకే ఒక్క కేసీఆర్. గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ భావోద్వేగానికైనా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతుంది. సంస్కృతిని, మానవ సంబంధాల్ని చక్కగా ఆవిష్కరించిన చిత్రంలా ‘బలగం’ కనిపిస్తోంది. ఇలాంటి సినిమా తీసిన వేణుకు అభినందనలు. సి.నారాయణరెడ్డి, మిద్దె రాములక్క లాంటి వాళ్లు సిరిసిల్ల గడ్డపై పుట్టారు. అక్కడే పుట్టిన వేణు ఇప్పుడు సిరిసిల్లకు సినిమాను తీసుకొచ్చాడు. భీమ్స్, మంగ్లీ, కాసర్ల శ్యామ్ లాంటి వాళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తెలంగాణ సినిమాకు ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలుసు. భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్తాం’’ అని కేటీఆర్ అన్నారు.