ధమ్కీ.. డిమాండ్ తగ్గలా

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి విశ్వక్సేన్ సినిమా ‘ధమ్కీ’ థియేటర్లలో కనిపిస్తుండాలి. ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మూడు నెల ముందే ప్రకటించారు. అప్పటికే థియేట్రికల్ ట్రైలర్ కూడా లాంచ్ చేసేశారు. ట్రైలర్ వచ్చేసిందంటే సినిమా అప్పటికే రిలీజ్‌కు రెడీ అయిపోయినట్లు. కానీ అనూహ్యంగా సినిమాను వాయిదా వేసేశారు.

ఇందుకు ప్రధాన కారణం.. పెద్ద హిట్టయిన రవితేజ సినిమా ‘ధమాకా’తో ఆ చిత్రానికి పోలికలు ఉండడమే అని తెలుస్తోంది. కథలో సారూప్యతలు ఉండడంతో తక్కువ గ్యాప్‌లో అలాంటి సినిమా ఇంకోటి రిలీజ్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుందని భయపడ్డట్లున్నారు. దీనికి తోడు కొంత మేర రీషూట్లు చేయడం మంచిదని కూడా ఫీలైనట్లున్నారు. ఇటీవలే కొన్ని రోజుల పాటు ఆ రీషూట్లు కూడా జరిగాయి. అంతా ఓకే అనుకున్నాక గుమ్మడికాయ కూడా కొట్టేశారు.

తమ సినిమాను వాయిదా వేయడం అన్ని రకాలా మంచిదే అయిందని.. ఇప్పుడు సినిమాను పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకుని క్రేజీ సీజన్ అయిన వేసవిలో రిలీజ్ చేసుకుందామని చూస్తున్నారు. రిలీజ్ వాయిదా పడటం వల్ల ట్రేడ్‌లో ఏమీ ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదని అర్థమవుతోంది. విశ్వక్ సినిమాలకు ముందు నుంచి నైజాంలో మంచి డిమాండే ఉంది. అతడి సినిమాలు ఎక్కువగా తెలంగాణ వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. తన సినిమాల్లో లోకల్ ఫ్లేవర్ బాగా ఉంటుంది. విశ్వక్‌కు మార్కెట్ బలంగా ఉన్నది కూడా నైజాంలోనే.

ఈ నేపథ్యంలోనే ‘ధమ్కీ’ సినిమాను ఏషియన్ సునీల్ మంచి రేటు ఇచ్చి నైజాం వరకు హక్కులు తీసేసుకున్నట్లు సమాచారం. అందుకోసం ఆయన రూ.4 కోట్లు పెట్టినట్లు సమాచారం. ఈ లెక్కన సినిమా ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ ఈజీగా రూ.10 కోట్లు దాటేయొచ్చు. ఈ సినిమా రేంజికి ఇది పెద్ద నంబరే మరి. మంచి ప్రోమోలు ఇంకొన్ని వదిలి.. అగ్రెసివ్ ప్రమోషన్లు చేస్తే విశ్వక్ కెరీర్లో ‘ధమ్కీ’ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకునే ఛాన్సుంది.