మేమూ మేమూ బాగుంటామని హీరోలు పబ్లిక్ స్టేజిల మీద పదే పదే చెప్పినా గ్రౌండ్ లెవెల్ లో ఫ్యాన్స్ గోల మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టుగానే సాగుతుంది. ముఖ్యంగా ట్విట్టర్ లో వీళ్ళు చేసే రచ్చ చూస్తే ఈ బ్యాచులో చాలా మంది నిజంగా చదువు సంస్కారం తెలిసినవాళ్ళేనా అనిపిస్తుంది. ఇటీవలే జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ ఎక్కువ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హఠాత్తుగా సంభవించిన తారకరత్న మరణంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల వెంటనే వెళ్లలేకపోయాడు కానీ మరో ఉద్దేశం లేదు.
ఈలోగా హెచ్సిఏ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో వాటిని అభిమానులు వైరల్ చేస్తూ అదేదో చరణ్ కే గుర్తింపు వచ్చినట్టు సదరు కమిటీ సభ్యులు తారక్ పేరుని పరిశీలించలేదన్నట్టు అర్థం లేని ప్రచారం తలకెత్తుకున్నారు. అక్కడితో ఆగలేదు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ ట్రెండింగ్ షురూ చేశారు. ఆనంద్ మహీంద్ర ఈ ట్యాగ్ ని వాడి చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేయడం వ్యవహారాన్ని ఇంకో దిశగా తీసుకెళ్లింది. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా రేస్ కోర్స్ లో ఇద్దరూ కలుసుకున్నాక అప్పుడు పెరిగిన చనువు వల్ల ఇచ్చిన అభినందన అది.
అంతే తప్ప ఆర్ఆర్ఆర్ కు సంబంధించి మిగిలినవాళ్లను తక్కువ చేయాలని కాదు. స్పాట్ లైట్ అవార్డు ఇచ్చింది కూడా టీమ్ కు కలిపేనన్న సంగతి కూడా ఈ గొడవలో పక్కకెళ్లిపోయింది. జూనియర్ వచ్చే వారం లోగా యుఎస్ చేరుకుంటాడు. ఆస్కార్ ఈవెంట్ కు హాజరయ్యేలా ప్లానింగ్ కూడా చేసుకున్నాడు. ఇదంతా కాదు కానీ ట్రిపులార్ సక్సెస్ క్రెడిట్ లో సింహభాగం దక్కాల్సిన రాజమౌళిని పక్కనపెట్టేసి ఇలా ట్యాగులు బిరుదులంటూ ఇలా ఫ్యాన్స్ కామెడీ చేయడం చూస్తే చరణ్ తారక్ ఇద్దరూ పగలబడి నవ్వుకుంటారేమో. ట్విట్టర్ ఫాలోయర్స్ అమాయకత్వానికి పరాకాష్ట ఇది.