అంత టాలెంట్ ఉన్నా..

మిక్కీ జే మేయర్.. పేరుకు తెలుగు వాడు కాదు కానీ.. అతను సంగీత దర్శకుడిగా సినిమాలు చేసింది.. ఎదిగింది తెలుగులోనే. ‘హ్యాపీ డేస్’ మొదలుకుని ‘మహానటి’ వరకు తాను పని చేసిన ప్రతి సినిమాలోనూ సంగీత దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే మాస్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇవ్వలేడని.. క్లాస్ సినిమాలకు మాత్రమే అతను సరిపోతాడని ఒక ముద్ర పడిపోయింది.

కెరీర్లో మిక్కీ సినిమాలు దాదాపుగా అన్నీ మ్యూజికల్ హిట్లే. అయినా సరే ‘మాస్ మ్యూజిక్’ ఇవ్వలేడన్న ముద్ర కారణంగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. చివరగా అతడి నుంచి వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు సాధించినా.. మ్యూజికల్‌గా కూడా అవి హిట్టయినా.. చేతిలో పెద్దగా సినిమాలు లేక ఖాళీ అయిపోయే పరిస్థితి రావడం విచారకరం. మిక్కీ చివరి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ తనకు మంచి పేరే తెచ్చింది. అంతకుముందు ‘మహానటి’ అతడికి ఎంత అప్లాజ్ తెచ్చిపెట్టిందో తెలిసిందే.

అయినా సరే మిక్కీ కెరీర్ ఏమంత ఊపందుకోలేదు. ‘ప్రాజెక్ట్-కే’ రూపంలో అతి పెద్ద అవకాశం మిక్కీ తలుపు తట్టింది. ‘మహానటి’కి గొప్ప మ్యూజిక్ ఇచ్చాడనే కృతజ్ఞతతో ‘ప్రాజెక్ట్-కే’కు కూడా అతణ్నే తీసుకున్నాడు నాగ్ అశ్విన్. అతను టాలెంటెడే అయినా.. ఇంత పెద్ద ప్రాజెక్టుకు న్యాయం చేసేలా పాన్ ఇండియా స్థాయిలో ఇంపాక్ట్ చూపించేలా మ్యూజిక్ ఇవ్వగలడా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనా నాగ్ అశ్విన్.. మిక్కీకే కట్టుబడ్డట్లు కనిపించాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. అతడి స్థానంలోకి ఇప్పుడు సంతోష్ నారాయణన్ వచ్చేశాడు.

ఇది మిక్కీకి పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. అసలే మిక్కీ కెరీర్ చాలా డల్లుగా సాగుతున్న టైంలో ‘ప్రాజెక్ట్-కే’ కూడా చేజారింది. ఇక అతను కెరీర్లో పుంజుకోవడం కష్టమే. ప్రస్తుతానికి అతడి చేతిలో ఉన్నది ‘రామబాణం’ సినిమా మాత్రమే. ఇది అతడి శైలికి తగ్గ సినిమా కాదు. పక్కా మాస్ మూవీ. ఇలాంటి సినిమాకు అతను ఏమాత్రం న్యాయం చేస్తాడో ఏంటో మరి.