కుటుంబ నేపథ్యం ఏదైనా డెబ్యూ హీరో లాంచ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కథలు సినిమాలు చేయడమే కాదు వాటిని ఏ టైంలో తీసుకొస్తున్నాం జనానికి ఎలా చేరువ చేస్తున్నామనేది ముఖ్యం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు గణేష్ ని ఆ మధ్య దసరా పండక్కు స్వాతిముత్యంతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ పోటీ మధ్య నలిగిపోయిన ఈ ఎంటర్ టైనర్ కు ఎంత మంచి టాక్ వచ్చినా అది వసూళ్లలో మారలేదు. తీరా ఓటిటిలో చూసిన ప్రేక్షకులు అరె బాగానే ఉంది కదా ఎలా మిస్ అయ్యామని నిట్టూర్చారు.
దీంతో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లా అయ్యింది. ఇప్పుడు గణేష్ రెండో మూవీ వస్తోంది. నేను స్టూడెంట్ సర్ ని మార్చి 10న విడుదల చేయబోతున్నారు. టీజర్ ఎప్పుడో మూడు నెలల క్రితం వచ్చింది. ఏదో డిఫరెంట్ గానే ట్రై చేసినట్టు విజువల్స్ చూశాక అర్థమయ్యింది. అయితే దీనికీ ప్రమోషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చేతిలో రెండు వారాల కంటే తక్కువ టైం ఉంది. విడుదల టైమింగ్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది కానీ ఎటొచ్చి ఓపెనింగ్స్ కి కావాల్సిన బజ్ ని ఇంకా తెచ్చుకోవాలి. ఆ రోజు చెప్పుకోదగ్గ కాంపిటీషన్ ఏమంత లేదు
ఆది సాయికుమార్ సిఎస్ఐ సనాతన్ అనే ఇన్వెస్టిగేషన్ డ్రామా ఏదో ప్లాన్ చేసుకున్నారు. నేను స్టూడెంట్ లో అవంతిక దసాని హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈమె ఎవరో కాదు అలనాటి ప్రేమ పావురాలుతో ఇండియా వైడ్ యూత్ ని ప్రేమలో పడేసిన భాగ్యశ్రీ కూతురు. తల్లి కూడా ఆ మధ్య రాధే శ్యామ్ లో ప్రభాస్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చారు కానీ అది ఫ్లాప్ కావడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. మరి అవంతికకు ఈ స్టూడెంట్ బ్రేక్ ఇస్తే మరికొన్ని అవకాశాల మీద ఆశలు పెట్టుకోవచ్చు. రాఖి ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న దీనికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు