అభిమానులు ఎంత గొడవ చేసినా.. వద్దు మొర్రో అన్నా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాడు. సినిమాలకు మరీ ఎక్కువ టైం కేటాయించే పరిస్థితి లేదు. అదే సమయంలో రాజకీయాలు, వ్యక్తిగత అవసరాల కోసం డబ్బులు కావాలి.
అలాంటపుడు తక్కువ సమయంలో పూర్తి చేయగలిగే రీమేక్ సినిమాలే బెస్ట్ అని పవన్ ముందుకు సాగిపోతున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని అభిమానులు కూడా అర్థం చేసుకోక తప్పదు. పవన్ సినిమాలు చేయకపోవడం కంటే.. రీమేక్ అయినా చేయడం మంచిదే కదా?
ఇటీవలే పవర్ స్టార్.. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలయికలో వినోదియ సిత్తం రీమేక్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. త్రివిక్రమ్ మార్పులు చేర్పులతో, అదనపు హంగులతో స్క్రిప్టు రెడీ చేసిచ్చాడు.
ఈ సినిమాను ముందు అనుకున్నట్లే అతి తక్కువ రోజుల్లో పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది చిత్ర బృందం. పవన్ హరిహర వీరమల్లు షూట్ కొన్ని రోజులు పక్కన పెట్టి వరుసగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. అటు ఇటుగా మూడు వారాల డేట్లు మాత్రమే ఈ సినిమాకు కేటాయించాడట పవర్ స్టార్.
ఆలోపు ఆయన పాత్రకు సంబంధించి షూట్ అంతా అయిపోతుంది. పవన్ కాంబినేషన్ లేని సీన్లు తర్వాత తీసుకుంటారు. మొత్తంగా మూణ్నాలుగు నెలల్లో షూట్ మొత్తం పూర్తయ్యేలా ప్లానింగ్ జరిగిపోయింది. అంతే కాక సినిమా మొదలైన ఆరు నెలల్లోపే రిలీజ్ కూడా చేసేయనున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులోనే వినోదియ సిత్తం రీమేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అంటే మొదలైన ఆరు నెలలకే రిలీజ్ అన్నమాట. ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates