ప్రాజెక్ట్ K కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్

ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఆ డేట్ కి కట్టుబడతారా లేదానేది ఇప్పుడే చెప్పలేం కానీ ఆ టార్గెట్ కి అనుగుణంగా దర్శకుడు నాగ అశ్విన్ ఒకపక్క షూటింగ్ ని బ్యాలన్స్ చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. విఎఫెక్స్ కంపెనీలకు డెడ్ లైన్ ఇవ్వడం కోసమే ఇలా ప్రకటన ఇచ్చారన్న కామెంట్లు లేకపోలేదు. నిర్మాత అశ్వినిదత్ ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ తీసుకోవచ్చు.

ఇప్పుడీ ప్రాజెక్ట్ కె సాంకేతిక వర్గంలో ఓ కీలక మార్పు ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇస్తోంది. సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణన్ ఈ టీమ్ తో జాయిన్ కాబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంతకు ముందు మిక్కీ జె మేయర్ ఉన్నారు. ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి అతను న్యాయం చేయలేరు అనుకున్నారో లేక ఎక్కువ సమయం యుఎస్ లోనే ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ ఇబ్బందవుతుందన్న ఉద్దేశమో బయటకి చెప్పలేదు కానీ మొత్తానికీ మార్పు అభిమానులకు ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.

సంతోష్ నారాయణన్ బెస్ట్ ఛాయస్ అవుతాడు. నాని దసరాకు కంపోజర్ తనే. టీజర్ లో బీజీఎమ్, ఆన్లైన్లో రిలీజ్ చేసిన పాటలు ఆల్రెడీ జనానికి ఎక్కేశాయి. నేపధ్య సంగీతం ఇవ్వడంలో రెహమాన్, హరీష్ జైరాజ్ ల రేంజ్ తన నుంచి ఆశించవచ్చు. అందుకే ప్రాజెక్ట్ కెకి ఏరికోరి మరీ ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. తమన్ లాంటి ఆప్షన్ ఉన్నా ఆల్రెడీ బోలెడు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న తనకు ఈ ప్రాజెక్టు కె కూడా ఇస్తే ఇబ్బందెందుకని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఏడాదిలో ఫిబ్రవరి కూడా అయిపోతోంది. ఇంకో పదే నెలల్లో ప్రాజెక్ట్ కె తెరపైకి వచ్చేస్తుంది.