హోం టూర్ వీడియోతో చిక్కుల్లో నటుడు

సోషల్ మీడియాలో కొంచెం పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లందరూ హోం టూర్ వీడియోలు పెట్టేయడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం పెద్ద ఇల్లు ఉంటే చాలు.. వెల్కం టు హోం టూర్ అంటూ ఇళ్లంతా తిరిగి చూపిస్తూ వీడియో పెట్టేస్తున్నారు. ఇలా వీడియో పెట్టిన ప్రముఖ తమిళ నటుడు ఒకరు చిక్కుల్లో పడ్డాడు.

అటీవీ శాఖ అధికారులు అతడికి రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించే పరిస్థితి వచ్చింది. ఆ నటుడి పేరు.. రోబో శంకర్. పలు తమిళ చిత్రాల అనువాద వెర్షన్లతో రోబో శంకర్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు. ప్రస్తుతం తమిళంలో ప్రముఖ కమెడియన్లలో ఒకడు. ఇటీవల అతను ఒక యూట్యూబ్ ఛానెల్ వాళ్ల సహకారంతో తన ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రోబో శంకర్ హోం టూర్ వీడియో యూట్యూబ్‌లో మంచి ఆదరణే దక్కించుకుంది. కానీ ఇక్కడ ఉంది ట్విస్ట్.

ఒక జంతు ప్రేమికుడు ఈ వీడియో చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రోబో శంకర్ తన ఇంట్లో అరుదైన జాతి పక్షులను పెంచుకుంటూ ఉండడం, వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడమే ఇందుక్కారణం. అలెగ్జాండ్రెస్ పారకీట్స్ అనే జాతి పక్షులట అవి. వాటిని ఇళ్లలో పెంచడానికి వీల్లేదట. ఒకవేళ పెంచాలన్నా అందుకు అనుమతులు తీసుకోవాలట.

అదేమీ చేయకుండా రోబో శంకర్ తన ఇంట్లో ఆ పక్షులను పెంచుకుంటున్న విషయాన్ని హోం టూర్‌ వీడియోలో గమనించిన ఒక జంతు ప్రేమికుడు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు వచ్చి రోబో శంకర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు వ్యతిరేకంగా ఆ పక్షులను పెంచుకుంటున్నందుకు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించారు. అంతే కాక ఆ పక్షులను స్వాధీనం చేసుకున్నారు. హోం టూర్ వీడియో ఎంత పని చేసిందని తలపట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది శంకర్‌కు.