వీక్ డేస్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి నిర్మాతలకు కొత్త కొత్త కసరత్తులు తప్పడం లేదు. అందులోనూ ఫిబ్రవరి లాంటి డ్రై పీరియడ్ లో థియేటర్లకు జనం రావాలంటే ఆషామాషీ కంటెంట్ ఉంటే సరిపోదు. ఒకవేళ పర్వాలేదనే మాట బయటికి వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. మొన్న శుక్రవారం రిలీజైన వాటిలో ధనుష్ సార్ యునానిమస్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణుకథ మాత్రం దాని స్థాయిలో టాక్ తెచ్చుకోలేక సోమవారం నుంచి భారీ డ్రాప్ నే చవిచూస్తోంది.
అందుకే గీత ఆర్ట్స్ 2 కొత్త ఎత్తుగడ తీసుకుంది. ఈ బుధ గురువారాల్లో వినరో భాగ్యము విష్ణుకథకు సింగల్ స్క్రీన్లలో ఒక టికెట్ కొంటె మరొకటి ఫ్రీ ఆఫర్ ని అమలు పరచబోతున్నారు. అంటే యావరేజ్ గా 110 నుంచి 150 రూపాయలకు ఇద్దరు చూసేయొచ్చు. ఈ లెక్కన బాల్కనీ ధర ఒకరికి కేవలం 75 రూపాయలలోపే పడుతుంది. ఇది నిజంగా తెలివైన స్ట్రాటజీ. ముఖ్యంగా స్నేహితులు లవర్స్ తో చూడాలనుకునే యూత్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మొదటి వారం అయిదో రోజునే ఇలాంటి స్కీం పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.
మాములుగా అయితే ఓ రెండు వారాల తర్వాత ఇలాంటి ట్రై చేస్తారు. ఇటీవలే బాలీవుడ్ మూవీ షెహజాదాకు ఫస్ట్ డేనే వన్ ప్లస్ వన్ పెడితే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అల వైకుంఠపురములో రీమేక్ అక్కడి జనాలకు కనెక్ట్ కాలేదు. దీనికన్నా శాటిలైట్ ఛానల్ లో చూసిన అల్లు అర్జున్ డబ్బింగ్ వెర్షనే మెరుగ్గా అనిపించడంతో తిరస్కారం తప్పలేదు. ఒకవేళ ఇప్పుడీ కిరణ్ అబ్బవరం బొమ్మకు కనక ఈ ఆఫర్ వర్కౌట్ అయితే ఇతర ప్రొడ్యూసర్లు సైతం ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి సార్ లాంటి వాటికి అవసరం లేదు కానీ చిన్న నిర్మాతలు ఇలాంటివి ఆలోచించాల్సిన అవసరం ఉంది.